ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad : పర్యాటక హోటళ్లు ప్రైవేట్‌కు!

ABN, Publish Date - Aug 14 , 2024 | 05:04 AM

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

  • పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటళ్లలో నాసిరకంగా సదుపాయాలు

  • వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కారు

  • సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వడంపై కసరత్తు.. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు

  • ఇప్పటికే లీజుకిచ్చిన వాటిల్లో రూ.400 కోట్లకు చేరుకున్న అద్దె బకాయిలు

  • రాజకీయ సిఫారసులతో లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించని బడాబాబులు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్ధమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.

పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని.. సర్కారు భావిస్తోంది.

పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు.. అక్కడున్న వసతి కూడా బాగుందని భావిస్తే ఆ విషయం విస్తృత ప్రచారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అది రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తుంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది.


సర్కారు లీజుకు ఇవ్వాలని చూస్తున్న 35 హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాల్లో హైదరాబాద్‌ నెక్లె్‌సరోడ్‌లోని నీరా కేఫ్‌, గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరిలోని ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్‌, ఫంక్షన్‌ హాళ్లు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్దనున్న హోటల్‌ సిద్ధార్థ, సావనీర్‌ షాపులు, కాటేజీలు, కొండగట్టు, కాళేశ్వరం, జెన్నారంలోని హరిత రెస్టారెంట్లు ఉన్నాయి.

అలాగే పెంబర్తి, వైరా, జహీరాబాద్‌లలోని పర్యాటక స్థలాలు, అలంపూర్‌, రామప్ప, భద్రాచలం, లక్నవరం, బాసర, మెదక్‌ ఫోర్ట్‌, ఘనపూర్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, అలీసాగర్‌లోని హరితహోటళ్లు, రెస్టారెంట్లు.. గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియం, సిద్దిపేట కోమటిచెరువు ప్రాంతంలోని గేమింగ్‌ జోన్‌, సింగూర్‌లోని ఎకో టూరిజం పార్క్‌, ఝరాసంగం కాటేజీలు, శ్రీరంగపురం రెస్టారెంట్‌, మహబూబ్‌నగర్‌లోని మినీ శిల్పారామం, బంకెట్‌హాల్‌, షాపులు సైతం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటు హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌ బాపూఘాట్‌ సమీపం సంగం ప్రాంతంలోని ఎకరంన్నరకు పైగా ఖాళీ స్థలాన్ని కూడా లీజుకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లీజుకిచ్చిన పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. సుమారు రూ.400 కోట్లకు పైగా పర్యాటక సంస్థకు లీజు బకాయిలు రావాల్సి ఉందని అంచనా.

ఎప్పటికప్పుడు లీజు మొత్తాన్ని వసూలు చేయడానికి అవసరమైన యంత్రాంగం పర్యాటక సంస్థలో అందుబాటులో లేకపోవడంతో రూ.వందల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్టు ఆరోపణలున్నాయి. రాజకీయ సిఫారసులతో పర్యాటక సంస్థ ఆస్తుల లీజు దక్కించుకున్న కొందరు బడా బాబులు రూ. కోట్ల బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేశారు.


దీంతో బకాయిలు వసూలు చేయలేక పర్యాటక సంస్థ లీజుదారులకు నోటీసులు జారీ చేసి వారి సమాధానం కోసం నిరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే కొంతమంది లీజుదారులు కోర్టులను ఆశ్రయించారు. ఇక కొత్తగా లీజుకు ఇవ్వాలని చూస్తున్న 35 ఆస్తులకు సంబంధించి ఏటా కోట్లలోనే ఆదాయం సమకూరుతోంది.

ఆ ఆదాయానికి తగ్గట్లుగానే లీజు వస్తుందా? అన్నది కూడా సర్కారు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే లీజు బకాయిలు, భవిష్యత్తులో అద్దెవసూళ్లకు సంబంధించిన అంశాలపై పకడ్బందీ విధానాన్ని అనుసరించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉద్యోగుల్లో ఆందోళన..

పర్యాటక సంస్థ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొని ప్రైవేటుకు లీజుకిచ్చిన పక్షంలో ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలో పని చేస్తున్న తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక సంస్థలో సుమారు 650కి పైగా వివిధ స్థాయులో ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇందులో 60 మంది వరకు రెగ్యులర్‌ కాగా.. మరో 180 మంది కాంట్రాక్టు, 400 మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు. ఈనేపథ్యంలోనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొత్తగా లీజుకు తీసుకునే సంస్థలతో పనిచేసేలా చేస్తే.. వీరి ఉపాధికి ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Aug 14 , 2024 | 05:04 AM

Advertising
Advertising
<