Hyderabad: రేపు ఆఖరు.. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ప్రచారం
ABN, Publish Date - May 10 , 2024 | 09:51 AM
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
- చివరి రోజు బైక్ ర్యాలీల నిర్వహణకు మొగ్గు
- నేడు ఎల్‌బీ స్టేడియంలో మోదీ సభ
హైదరాబాద్ సిటీ: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మార్చి 16న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ ప్రకటించగా.. 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుండడంతో రేపు సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. వాస్తవంగా సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలి.. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పొడిగించింది. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు వరకు ప్రచారం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రేపు 6 గంటల వరకు ప్రచారానికి అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రోస్(Ronaldros) తెలిపారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం అభ్యర్థులకు సాధ్యపడలేదు. ఎక్కడికక్కడ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఏరియాల్లో ఇంటింటి ప్రచారానికి పరిమితమైన అభ్యర్థులు.. రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు మొగ్గు చూపారు. అన్ని ప్రాంతాలకు వెళ్లకపోవడం ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందా..? అన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బలముందనుకున్న ప్రాంతాల్లో తక్కువ ఓట్లు పోలయ్యాయి. కారణం.. కొన్ని ఏరియాల్లో నేను తిరగకపోవడమే. అభ్యర్థి రానందుకే ఓటు వేయలేదని మా పార్టీ శ్రేణులతో స్థానికులు చెప్పారట. ఇప్పుడా పొరపాటు పునరావృతం కాకుండా.. వీలైనంత మేర నేను తిరుగుతూనే మా కుటుంబ సభ్యుల తో ప్రచారం చేయిస్తున్నా’ అని ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..
రంగంలోకి అగ్రనేతలు
గడువు దగ్గర పడుతుండడంతో నగరంలో ప్రచార హోరు పెరిగింది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. గురువారం సరూర్‌నగర్ స్టేడియం(Sarurnagar Stadium)లో నిర్వహించిన బహిరంగ సభకు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) హాజరయ్యా రు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్రమోదీ, మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, హర్‌దీప్ సింగ్, అనురాగ్‌సింగ్ ఠాగూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సీనియర్ నేతలు తమిళిసై, అన్నామళై, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్‌వర్మ తదితరులు నగరంలో ప్రచారం నిర్వహించారు. నేడు ఎల్‌బీ స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండడంతో మెజార్టీ అభ్యర్థులు కుటుంబ సభ్యులను ప్రచార రంగంలోకి దించారు. రెండు రోజులే సమయమున్న నేపథ్యంలో నేడు, రేపు వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. చివరి రోజు పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీల నిర్వహణకు రంగం సిద్ధం చేశారు.
ఇదికూడా చదవండి: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 09:51 AM