Aadi Srinivas: ఆ భూమిని ధరణిలో ఎక్కించారు.. కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Nov 27 , 2024 | 09:50 PM
బెదిరింపులకు పాల్పడుతున్న కేటీఆర్‌పై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. కేటీఆర్ లాక్కున్న భూములు ప్రభుత్వ భూములుగా గుర్తించడం అధికారులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సిరిసిల్లా భూ ఆక్రమణలపై సీఐడీ విచారణ జరపాలని సీఎంఓకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
హైదరాబాద్: కేటీఆర్ అధికారం కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కలెక్టర్‌ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అంటారా అని ధ్వజమెత్తారు. కలెక్టర్లను సన్నాసి అంటారా అని ఫైర్ అయ్యారు. అధికారులను తిట్టడం, బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని బెదిరించడం ఏంటని నిలదీశారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన మనుషులకు వెయ్యి ఎకరాల భూమిని ధరణిలోకి ఎక్కించారని ఆరోపించారు. కేటీఆర్ లాక్కున్న భూములు ప్రభుత్వ భూములుగా గుర్తించడం అధికారులు చేసిన తప్పా అని ప్రశ్నించారు. సిరిసిల్లా భూ ఆక్రమణలపై సీఐడీ విచారణ జరపాలని సీఎంఓకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐఏఎస్‌ల సంఘం స్పందించాలని అన్నారు.
బెదిరింపులకు పాల్పడుతున్న కేటీఆర్‌పై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. తాను అంత మంచోడిని కాదని కేటీఆర్ అంటున్నారని. తాము కూడా అదే చెబుతున్నామని హెచ్చరించారు. కేటీఆర్ తన చర్మాన్ని వలిచి సిరిసిల్లా ప్రజలకు చెప్పులు కుట్టించిన తప్పు కాదన్నారు. భిన్న ధ్రువాలైన బీజేపీ, కాంగ్రెస్ ఒకటి అని కేటీఆర్ అంటున్నారని చెప్పారు. కేసీఆర్ మహావృక్షం కాదు. విషవృక్షమని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవ్వలేమని కేటీఆర్ చేతులు ఎత్తేస్తే తాము పోరాడి సాధించామని అన్నారు. అధికారులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.
Updated Date - Nov 27 , 2024 | 09:50 PM