Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:59 AM
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. అల్లు అర్జున్‌ను విడుదల చేస్తుండటంతో ఆయన అభిమానులు భారీగా జైలు వద్ద గూమిగూాడారు.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు నిన్న(శుక్రవారం) ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. 'పుష్ప 2 ది రూల్' ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో శుక్రవారం హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ(శనివారం) ఉదయం 6:45 గంటలకు చంచల్ గూడ జైలు నుంచి ఆయనను విడుదల చేశారు. బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేటు నుంచి అధికారులు పంపించారు.
మధ్యంతర బెయిల్‌పై అల్లు అర్జున్ ఈరోజు విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సంధ్యాథియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. చంచల్‌గూడ జైలుకు ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ కాపీ అందజేశారు. మంజీరా బ్యారక్ నుంచి అడ్మిషన్ బ్యారక్‌కు అల్లు అర్జున్‌ను తరలించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం జైలుకు ఆయన బాడీగార్డ్స్ చేరుకున్నారు. చంచల్‌గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
జైలు అధికారులు ఏమన్నారంటే..
అల్లు అర్జున్‌ను ఉదయం 6.45 గంటలకు విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్‌ను వెనుక గేటు నుంచి పంపించామని చెప్పారు. అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను విడుదల చేశామని అన్నారు. సంధ్యా థియేటర్ యజమానిని విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ బెయిల్ పేపర్లు అందడానికి ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ పేపర్లు అందాయని జైలు అధికారులు తెలిపారు. చంచల్‌గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నివాసం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు..
హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు అల్లు అర్జున్‌ను విడుదల చేస్తుండటంతో చంచల్‌గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు నిన్న(శుక్రవారం) 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రత్యేక పోలీస్ బృందం భారీ బందోస్తు నడుమ అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) బన్నీ విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు.
రాత్రంతా జైలులోనే అల్లు అర్జున్
రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ విడుదల కాలేదు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీ అరెస్టైన విషయం తెలిసిందే. తొక్కిసలాట కేసులో మొత్తం 18 మంది నిందితులను చేర్చారు. ఈ కేసులో A11 నిందితుడిగా అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్‌కు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. అల్లు అర్జున్ కోసం ఇంటి నుంచి బయల్దేరిన ఆయన బాడీగార్డ్స్ నిన్న జైలు నుంచి విడుదల కాకపోవడంతో అల్లు అర్జున్‌కు అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ 7697ను జైలు అధికారులు ఇచ్చారు. చంచల్‌గూడ జైలు మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్ ఉన్నారు. చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాత్రి చంచల్‌గూడ జైలు దగ్గర అభిమాని హంగామా చేశారు. అల్లు అర్జున్‌ను వెంటనే విడుదల చేయాలంటూ పెట్రోల్ పోసుకుని అభిమాని హల్‌చల్ చేశాడు. పోలీసులు అడ్డుకున్నారు.
స్టేట్‌మెంట్ రికార్డు..
అల్లు అర్జున్‌ను పీఎస్‌లోకి తీసుకువెళ్లిన తర్వాత ఎవరినీ లోనికి రాకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ ఆధ్వర్యంలోని బృందం సుమారు గంటపాటు ఆయనను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఓవైపు ప్రశ్నిస్తూనే రిమాండ్ రిపోర్ట్‌ను తయారు చేశారు. మధ్యాహ్నం 1:30కు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ‘పుష్ప అరెస్టు’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులతోపాటు.. స్థానిక ప్రజలు ఎగబడ్డారు.
దాంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్‌ను విచారిస్తున్న క్రమంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, సినీ నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే లోపలికి రానిచ్చారు. ఆయన సోదరుడు అల్లు శిరీష్, కోల శ్రీకాంత్ అనే స్నేహితుడు పీఎ్‌సకు చేరుకోగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, మధ్యాహ్నం 2:15 గంటలకు అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో బీపీ, షుగర్, కొవిడ్ వంటి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భారీ బందోబస్తు నడుమ 3:10 గంటలకు నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. సుమారు 45 నిమిషాలపాటు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రం 4:00 గంటలకు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అల్లు అర్జున్‌ను నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచిన క్రమంలో హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్ కోర్టులోనే ఉండి పోలీస్ భద్రత, బందోబస్తును పర్యవేక్షించారు.
ఏం జరిగిందంటే..
నిజానికి డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వెళ్లారు. ఆ క్రమంలో వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు గాయపడ్డారు. దీంతో మహిళ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 105, 118 (1) కింద అల్లు అర్జున్, ఆయన భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి ముందు మహిళ మృతికి సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 11న అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.