Hyderabad: అల్లు అర్జున్ అరెస్టుపై రాజకీయ ప్రముఖుల ఫస్ట్ రియాక్షన్..
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:18 PM
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు.
హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడాన్ని పలువురు రాజకీయ నేతలు ఖండించారు. అల్లు అర్జున్ అరెస్టు, అరెస్టు చేసిన విధానంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరంటూ బీఆర్ఎస్ మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
వారిని అరెస్టు చేయండి: హరీశ్ రావు..
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుల వేధింపుల వల్లే చనిపోతున్నట్లు లేఖ రాసి మరీ కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. మృతుడిది ముఖ్యమంత్రి సొంత గ్రామమే అని, అయినా రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. రేషన్ కార్డు నిబంధనలు, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ మంత్రి గుర్తు చేశారు. దానికి కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అంటూ ప్రశ్నించారు.
అరెస్టు చేయాల్సి వస్తే ముందు ముఖ్యమంత్రి సోదరులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. "ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు, దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజనుల బతుకులను ఛిద్రం చేశారు, మరి దానికి ఎవరిని అరెస్టు చేయాలి?" అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు.. ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలంటూ చురకలు అంటించారు. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
రాజా సింగ్ ఏమన్నారంటే..
మరోవైపు అల్లు అర్జున్ అరెస్టును ఎక్స్ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఖండించారు. విషాదకర తొక్కిసలాట ఘటనకు పోలీసు శాఖ వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. తన నటన, విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టిన జాతీయ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని రాజా సింగ్ అన్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో నేరుగా బన్నీని బాధ్యుడిని చేయడం, దానికి అతన్ని జవాబుదారీగా చేయడం అన్యాయం, అసమంజసం అని రాజా సింగ్ అన్నారు. ఆ రోజు క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయకుండా నేడు అల్లు అర్జున్‌ని బాధ్యుడిని చేయడాన్ని ఖండించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజా సింగ్ అన్నారు.
బట్టలు మార్చుకునే సమయం ఇవ్వరా?: బండి సంజయ్..
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు గ్రహీత, నటుడు అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా నేరుగా బెడ్‌రూమ్ నుంచి తీసుకెళ్లడం అవమానకరమైన చర్య అని పేర్కొన్నారు. ప్రముఖ హీరో విషయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు బండి సంజయ్. భారతీయ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఒక స్టార్ హీరోకు పోలీసులు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, అయితే ఆ భారీ జన సందోహాన్ని కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని బండి అన్నారు.
Updated Date - Dec 13 , 2024 | 08:59 PM