Telangana: హైదరాబాద్‌పై కమలం ఫోకస్.. పెద్ద ప్లానే వేశారుగా..!
ABN, Publish Date - Apr 13 , 2024 | 08:09 AM
పాత బస్తీకి(Hyderabad Old City) చెందిన మైనార్టీ కీలక నేతకు బీజేపీ(BJP) గాలం వేసినట్లు తెలిసింది. సికింద్రాబాద్(Secunderabad), హైదరాబాద్(Hyderabad) గెలుపులో దోహదపడే అవకాశం ఉండడంతో ఆయనను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తరఫున పలుమార్లు పోటీ చేసిన ఆ నేత స్వల్ప ఓట్లతో..
కాంగ్రెస్ మైనార్టీ కీలక నేతకు బీజేపీ గాలం!
పాత బస్తీలో ఎంఐఎంకు చెక్ పెట్టడమే లక్ష్యం
మజ్లిస్ పట్ల హస్తం పార్టీ వైఖరితో అసంతృప్తి
సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలతో ధిక్కార స్వరం
ఇదే అదనుగా ఆహ్వానం పలికిన కాషాయ దళం
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): పాత బస్తీకి(Hyderabad Old City) చెందిన మైనార్టీ కీలక నేతకు బీజేపీ(BJP) గాలం వేసినట్లు తెలిసింది. సికింద్రాబాద్(Secunderabad), హైదరాబాద్(Hyderabad) గెలుపులో దోహదపడే అవకాశం ఉండడంతో ఆయనను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) తరఫున పలుమార్లు పోటీ చేసిన ఆ నేత స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. హస్తం పార్టీలో కొన్నేళ్లుగా కొనసాగుతూ పాతబస్తీలో మజ్లిస్ నేతలతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లిస్ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలను పాతబస్తీ అభివృద్ధిలో దూరం పెడుతుందని భావించారు. అలాకాకుండా కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ప్రకారంగా కలుపుకొని పోతుండడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు కాకుండా మరొకరికి పార్టీ అవకాశం కల్పించాలని చూస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఆ మైనార్టీ నేత జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడలో అంగన్‌వాడీ భవన ప్రారంభానికి హాజరైన పొన్నం స్థానిక మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి టీ తాగడాన్ని ప్రస్తావిస్తూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మజ్లిస్ నేతలతో వేదిక పంచుకోవడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా బీజేపీ నేతలు ఆ మైనార్టీ నేతకు టచ్‌లోకి వెళ్లారు. ఈ పరిణామం తర్వాతే ఆయన పార్టీని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అధిష్ఠానాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు కూడా చేయడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ఆయనను పిలిపించి వైఖరి మార్చుకోవాలని, పార్టీని వీడినా ఇబ్బంది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.
పతంగిని దించేందుకు..
కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేత చేరితే.. హైదరాబాద్ ఎంపీ స్థానంతో పాటు సికింద్రాబాద్ సీటు పరిధిలోని మైనార్టీ ఓట్లను ప్రభావితం చేయొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పాతబస్తీలో ఎంఐఎంకు మున్ముందు చెక్ పెట్టొచ్చని ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గంపగుత్తగా హిందువుల ఓట్లను రాబట్టుకుని.. మజ్లిస్ వ్యతిరేక మైనార్టీ ఓట్లను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వమే కాంగ్రెస్ మైనారిటీ నేతతో నేరుగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 13 , 2024 | 08:09 AM