TG News: ఈనెల 9న బీజేపీ మహిళా మోర్చా ధర్నా.. ఎందుకంటే.?
ABN, Publish Date - Jul 07 , 2024 | 05:48 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఈ నెల 9వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చింది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఈ నెల 9వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఈరోజు(ఆదివారం) ధర్నాకు సంబంధించిన వివరాలను బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy) మీడియాకు వెల్లడించారు. ఇందిరా పార్క్ వద్ద జరిగే ఆందోళనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 213 రోజులు అవుతుందన్నారు. మహాలక్ష్మీ పథకం కింద పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మేనిఫెస్టోలొ చెప్పారని ఇంతవరకు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తా అన్నారని ఆ హామీ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు.
18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీలు ఇస్తానని అన్నారని దానిని మరిచిపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు , హత్యలు జరుగుతున్న ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయిందని ఫైర్ అయ్యారు. గిరిజన మహిళ హత్య జరిగితే.. ఇంతవరకు గిరిజన మంత్రి సీతక్క ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి హోం శాఖను హ్యాండిల్ చేయడం రాకపోతే అది మరొకరికి ఇవ్వాలని హితవు పలికారు. డ్రగ్స్‌ను అణచివేస్తామని సీఎం చెప్పారని కానీ గంజాయి మత్తులో యువత ఊగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని శిల్పారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 07 , 2024 | 09:24 PM