Bandi Sanjay: అమాయకుడిలా కేటీఆర్ ఫోజులు, బండి సంజయ్ నిప్పులు
ABN, Publish Date - Aug 21 , 2024 | 04:42 PM
భారతీయ జనతా పార్టీలో చేరికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్దాంతాలు నచ్చి, ఎవరొచ్చినా సరే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, మిగతా నేతలు ఎవరొచ్చినా సరేనని అన్నారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో (BJP) చేరికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్దాంతాలు నచ్చి, ఎవరొచ్చినా సరే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, మిగతా నేతలు ఎవరొచ్చినా సరేనని అన్నారు. హరీశ్ రావు పార్టీ మార్పు గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పేరును బండి సంజయ్ ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేటీఆర్‌పై విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు చేశారు. ఆయన ఒక్కడే అమాయకుడు అనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్‌ది కాకుంటే గతంలో రేవంత్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఫామ్ హౌస్ సొంతం.. ఇప్పుడు లీజు తీసుకున్నారా అని నిలదీశారు. అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్‌ల కూల్చివేతను సమర్థించారు. గజాల్లో కట్టిన ఇళ్లను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) అధికారులు కూల్చివేస్తున్నారని తెలిపారు. భారీ భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కలెక్షన్ల కోసమేనని బండి సంజయ్ ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కోసం డబ్బులు పంపాలని సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ టార్గెట్ విధించిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆ క్రమంలో హైడ్రా ఆవిర్భవించిందని గుర్తుచేశారు.
ఎందుకు దూరం..
రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దూరంగా ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేసేందుకు కాదా అని అడిగారు. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత బెయిల్ కోసం అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా కృషి చేశారని.. అందుకోసం ఆయనను రాజ్యసభకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పంపిస్తున్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. కేసీఆర్ చెప్పినట్టే నడుస్తోందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అవడం ఖాయం అని స్పష్టం చేశారు.
లోపాయికారి ఒప్పందం..
కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకోసమే విగ్రహాల గొడవ తెరపైకి తీసుకొచ్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ గుర్తుచేశారు. ఆరు గ్యారంటీల అమలు గురించి ఎక్కడ ప్రశ్నిస్తామోనని ముందుగా విగ్రహాల అంశాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. సచివాలయం ముందు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాం నెలకొల్పాలని తమకు ఉంది. ప్రజా సమస్యల పరిష్కరించడం మంచిదని సూచించారు. విగ్రహాల అంశాన్ని పక్కనపెట్టి, పరిపాలనపై దృష్టిసారించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
For Latest News and Telangana News click here
Updated Date - Aug 21 , 2024 | 04:42 PM