Meal Scheme: నిజామాబాద్ జిల్లాలో వివాదం రేపిన మధ్యాహ్న భోజన ఘటన.. డీఈఓ ఏమన్నారంటే..?
ABN, Publish Date - Aug 04 , 2024 | 09:17 PM
నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఆదివారం నాడు అన్నం వడ్డించారు. అయితే ఈ సమయంలో కారం పొడితో భోజనం పెట్టినట్లు ప్రచారం జరిగింది. పాఠశాలలో జరిగిన ఘటన వివాదాన్ని రేపింది.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఆదివారం నాడు అన్నం వడ్డించారు. అయితే ఈ సమయంలో కారం పొడితో భోజనం పెట్టినట్లు ప్రచారం జరిగింది. పాఠశాలలో జరిగిన ఘటన వివాదాన్ని రేపింది. విద్యార్థులకు కారంతో కూడిన భోజనాన్ని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు వడ్డించారని వార్తలు వచ్చాయి. అయితే, ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటనపై వెంటనే విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించి విచారణ జరిపారు. కూర మాడిపోవడంతో విద్యార్థులు అక్కడే ఉన్న కారం వేసుకుని తిన్నారని పాఠశాల సిబ్బంది చెప్పారు.
డీఈఓ వార్నింగ్
మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే చర్యలు తప్పవని డీఈఓ హెచ్చరించారు. వంట కార్మికులకు, ఉపాధ్యాయులకు తగిన సూచనలు చేశామని తెలిపారు. రేపటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటివరకు రూ.58.69 కోట్లను విడుదల చేసినట్లు ప్రకటించారు. మరో రూ.18 కోట్లు రేపు (5-8- 2024) విడుదల చేస్తామని అన్నారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చెల్లించాల్సిన వంట ఖర్చులు, వంట కార్మికులకు రూ.1000 వేతనం జూన్ వరకు చెల్లించామని తెలిపారు. వంట కార్మికులకు చెల్లిస్తున్న రూ.2,000 వేతనానికి సంబంధించిన బిల్లులు జూన్ వరకు విడుదలయ్యాయని స్పష్టం చేశారు. జూలై నెల వేతనం చెల్లింపు కోసం నిధులు రేపు విడుదల చేస్తామని డీఈవో దుర్గాప్రసాద్ వెల్లడించారు.
కారం మెతుకులతో పెట్టడం అమానుషం: హరీష్‌రావు
మరోవైపు.. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ట్విట్టర్(X) వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం సరిగా లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతమైన భోజనాన్ని విద్యార్థులకు అందించడంలో ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కారం మెతుకులతో పెట్టడం అమానుషమని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత బాధ్యతారాహిత్యామా..?
‘‘నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్‌లో ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలి’’ అని హరీష్‌రావు కోరారు.
Updated Date - Aug 04 , 2024 | 09:43 PM