ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Food Poisoning: మళ్లీ ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత

ABN, Publish Date - Nov 26 , 2024 | 05:08 PM

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు.

నారాయణపేట: నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇవాళ (మంగళవారం) మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొంతమంది కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. 25 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మక్తల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.


రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్..

పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుల్లో అధ్వాన భోజనం పెట్టి.. పేద విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్‌ ఆటలాడుతోందని హరీశ్‌రావు విమర్శించారు.వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవలేదని. మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ధ్వజమెత్తారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని అన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. మాటలే తప్ప చేతలు లేని @TelanganaCMO నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని హరీష్‌రావు ప్రశ్నించారు.


గతంలో 100 మంది విద్యార్థులు అస్వస్థత

కాగా.. గతంలో నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరు కడుపునొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. మొత్తం 100 మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కొందరిని మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లలో తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు.


విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ముగ్గురు విద్యార్థులు మినహా మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, మాగనూరు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపి వారు తప్పు చేసినట్లు తేలితే సస్పెండ్‌ చేయాలని నారాయణపేట కలెక్టర్‌ను ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, విచారణ జరిపి.. తనకు నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.


కిచిడీలో పురుగులు..

నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్నవారిలో 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటే, కొందరు కడుపునొప్పి.. తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు పిల్లల్లో కొందరిని మక్తల్‌ ప్రభుత్వాస్పత్రికి.. మరికొందరిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 మంది విద్యార్థులకు అల్పాహారంగా కిచిడీ పెట్టగా అందులో పురుగులొచ్చాయి. వార్డులో చికిత్స పొందుతున్న శివసాయి అనే విద్యార్థి తన ప్లేటులో ఉన్న కిచిడీలో పురుగులుండటం గమనించి తల్లిదండ్రులకు చెప్పాడు. మరికొంతమంది పిల్లలు కూడా అల్పాహారంలో పురుగులొచ్చాయని ఫిర్యాదు చేశారు.


నమూనాల సేకరణ..

ఆ పురుగులను వెంటనే స్టాఫ్‌నర్సుకు చూపించడంతో డైట్‌ కాంట్రాక్టరుకు విషయాన్ని ఆమె చేరవేసింది. స్పందించిన కాంట్రాక్టరు కిచిడీని తీసేసి ఉప్మా చేసి పంపారు. కాగా పిల్లల వార్డులో అల్పాహారంలో పురుగులొచ్చినట్లు తేలడంతో ముందుగా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ మనోజ్‌కుమార్‌ వార్డులోని పిల్లలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని వంటశాలలో వంటకాలను, దినుసులను పరిశీలించారు. అన్నింటి నమూనాలను సేకరించారు. అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ కూడా ఆస్పత్రికొచ్చి విద్యార్థులతో మాట్లాడారు. అయితే పురుగులున్న అల్పాహారం అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని, రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొనడం విశేషం. విద్యార్థులకు అందించిన భోజనంలో ఎలాంటి కల్తీ లేదని, నాణ్యత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పురుగుల కిచిడీ ఘటనపై పూర్తి విచారణ చేశామని, నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించామని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ సింగ్‌ చెప్పారు. కాగా జనరల్‌ ఆస్పత్రిలో బాధిత విద్యార్థులను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పరామర్శించారు.


మళ్లీ పురుగుల అన్నమే

మాగనూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్నాహ్న భోజనంలో పురుగులు రావడం, తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయిన ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించినా నిర్వాహకుల తీరు మారలేదు. రెండో రోజైన ఆ బడి మధ్యాహ్న... భోజనంలో పురుగులొచ్చాయి. చూసిన విద్యార్థులు భోజనం చేయలేదు. మళ్లీ మళ్లీ పురుగుల అన్నమే పెడతారా అంటూ నిర్వాహకుల తీరుకు నిరసనగా పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వాహించారు. పురుగులు ఉన్న బియ్యాన్ని వండటం వల్ల అన్నంలో పురుగులొచ్యాని, మధ్యాహ్న భోజనాన్ని అధికారులు పర్యవేక్షణలో నిర్వహించినా అన్నంలో పురుగు రావడం ఎంత వరకు సమంజసం అని విద్యార్థులు మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో ఉన్న పురుగులు ఉన్న బియ్యం బస్తాలను ట్రాక్టర్‌ ద్వారా మక్తల్‌ సివిల్‌ సప్లై గోదాంకు తరలించారు. నాణ్యమైన బియ్యాన్ని తీసుకొస్తామని ఆర్డీవో రాంచంద్రయ్య విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా బడిలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నం తయారు చేసి వడ్డించారు.


మాగనూరు ఘటనపై సీఎం సీరియస్‌

మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయుడు మురళీధర్‌రెడ్డి, ఇన్‌చార్జిగా ఉన్న బాబుల్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. అలాగే వంట ఏజెన్సీలను రద్దు చేశారు. మరోసారి భోజనంలో పురుగులు రావడంతో డీఈవో అబ్దుల్‌ గనీని సస్పెండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో రాంచందర్‌, ఫుడ్‌ ఇన్స్‌ఫెక్టర్‌లకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. పాఠశాలలోని వంట గది, స్టోర్‌ రూమును, వంటకు వినియోగించే బియ్యాన్ని నిత్యావసర సరకులను పరిశీలించారు. జరిగిన సంఘటన గురించి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో, వంట ఏజెన్సీలతో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇకపై ప్రతి రోజు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పరిశీలించి రుచి చూశాకే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ బెల్‌శాలం కూడా పాఠశాలను పరిశీలించారు.

Updated Date - Nov 26 , 2024 | 05:34 PM