Harish Rao: మధ్యాహ్న భోజనం ఇలాగేనా..? సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ధ్వజం
ABN, Publish Date - Aug 04 , 2024 | 04:04 PM
కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ట్విట్టర్(X) వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ట్విట్టర్(X) వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం సరిగా లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యతమైన భోజనాన్ని విద్యార్థులకు అందించడంలో ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కారం మెతుకులతో పెట్టడం అమానుషమని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత బాధ్యతారాహిత్యామా..?
‘‘నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకొన్నారు. ప్రభుత్వం భావిభారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడం బాధాకరం. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామాగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్‌లో ఉండడం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలి’’ అని హరీష్‌రావు కోరారు.
జాబ్ క్యాలెండర్ చూసి నవ్వుతున్నారు: రాకేశ్‌రెడ్డి
మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు లేవని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy) విమర్శించారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో రాకేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగాల క్యాలెండర్ కాదు...ఉత్తుత్తి క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు నవ్వుకుంటున్నారని దెప్పిపొడిచారు.
ప్రజాపాలన అంటే ఇదేనా..?
ప్రజలను అవసరానికి వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదని విమర్శించారు. ప్రజలను ముంచడంలోను కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పారు. యువతను ఎన్నికల సమయంలో ఊరు, వాడ తిప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు యువతను కేసులు పెట్టి పోలీసు స్టేషన్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. జీవో46 భాదితులు ప్రజా భవన్‌కు వెళ్తే అర్ధరాత్రి వారిని కొట్టి అరెస్టు చేశారని.. ప్రజా పాలన అంటే ఇదేనా అని ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రశ్నించారు.
యువతను మోసం చేశారు: కేటీఆర్
మరోవైపు.. పోరాటాలు తమకు కొత్తేం కాదని.. కాంగ్రెస్ నేతలు బూతులు తిట్టినా, అవమానించినా ప్రజా సమస్యలపై సర్కారును నిలదీస్తూనే ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానంపై అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతాం. వదిలిపెట్టం.. మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం. నిలదీస్తూనే ఉంటాం’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
జాబ్‌లెస్ క్యాలెండర్..
తన అరెస్టుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ‘ప్రభుత్వం ఏర్పడి 8 నెలలైనా ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. మరోసారి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి యువతను కలిసి మీ హామీని ఎలా నిలబెట్టుకుంటారో చెప్పండి’ అంటూ మరో పోస్టులో రాహుల్ గాంధీని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ అశోక్‌నగర్‌కు వచ్చి యువతతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
Updated Date - Aug 04 , 2024 | 04:15 PM