HarishRao: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం
ABN, Publish Date - Jun 22 , 2024 | 04:42 PM
గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (HarishRao) శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్ సమావేశంలో న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుంటారని ఎదురుచూశామని అన్నారు.
హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (HarishRao) శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్ సమావేశంలో న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుంటారని ఎదురుచూశామని అన్నారు. గ్రూప్ అభ్యర్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండా క్యాబినెట్ సమావేశం ముగించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మరిచారని ద్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి ఇస్తామని మాట ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు దాటిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలను ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అర్తనాదాలు చేయాల్సిన పరిస్థితికి తెచ్చారని చెప్పారు. గ్రూప్ 1, డిఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బంది కరంగా మారిందన్నారు.
కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారని గుర్తుచేశారు. గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని రేవంత్ మాట ఇచ్చారని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jun 22 , 2024 | 05:09 PM