CP Srinivas Reddy: సైబర్ నేరాలకు పాల్పడిన 36మంది అరెస్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి..
ABN, Publish Date - Aug 24 , 2024 | 07:26 PM
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన 36మంది సైబర్ క్రిమినల్స్‌ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్‌లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన 36మంది సైబర్ క్రిమినల్స్‌ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితులను ప్రత్యేక ఆపరేషన్ ద్వారా గుజరాత్‌లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. వీరంతా అక్కడ్నుంచే అమాయకులను అధిక లాభాల పేరిట మోసం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. దీంతో వల పన్ని నిందితులను అరెస్టు చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా ఈ 36మంది నిందితులపై సుమారు వెయ్యి కేసులు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వీరిపై సుమారు 150కేసులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ పరిధిలో 20కేసులు నమోదు అయ్యాయి. ఈ 20 కేసుల్లోనే వీరు సుమారు రూ.12కోట్లకు పైగా ఫ్రాడ్ చేశారు. వీరు దోచుకున్న నగదులో ఇప్పటికే రూ. 4.4 కోట్లు ఫ్రీజ్ చేశాం. ఫ్రీజ్ చేసిన డబ్బులో రూ.1.5కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చాం. వీరిని అరెస్టు చేసిన సమయంలో నిందితుల నుంచి రూ.38లక్షలు, బంగారం, ల్యాప్ ట్యాప్స్, బ్యాంక్ చెక్ బుక్స్, పాస్ బుక్స్ సీజ్ చేశాం. సెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులనూ సీజ్ చేశాం.
హైదరాబాద్‌లో మూడు మేజర్ క్రైమ్స్ ఇవే..
హైదరాబాద్ నగరంలో ట్రేడింగ్ పేరిట మోసాలు చేసిన ముగ్గురిని అరెస్టు చేశాం. కనాని, నికుంజ్ సహా కిషోర్ భాయ్ అనే చార్టెడ్ అకౌంటెంట్‌ని అదుపులోకి తీసుకున్నాం. ముందుగా నిందితులు మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రాంలో లింక్ సెండ్ చేస్తారు. అందులో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తు్న్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ట్రేడింగ్ పేరుతో నమ్మించి రూ.61లక్షలు కాజేశారు. బాధితుడు డబ్బులు పంపిన అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశాం. ఈ ముగ్గురిపై 142ఫిర్యాదులు NCRPలో నమోదు అయినట్లు గుర్తించాం. వీరిని అరెస్టు చేసి మొబైల్, బ్యాంక్ డెబిట్ కార్డ్స్, పాస్ బుక్ స్వాధీనం చేసుకున్నాం.
మరో కేసులో నిందితులు ఫెడ్ ఎక్స్(FedEx) పేరిట మోసాలకు పాల్పడ్డారు. ఈ మోసంలో బాధితులను రకరకాలుగా బెదిరించి డబ్బులు వసూలు చేశారు. నగరానికి చెందిన వృద్ధురాలైన డాక్టర్‌ని నిందితులు మోసం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశామంటూ ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. విచారణకు రావాలని ఫేక్ ఎఫ్ఐఆర్, నకిలీ ఆర్బీఐ లెటర్, సీబీఐ లెటర్లు పంపించారు. అరెస్టు కాకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు పంపాలంటూ భయపెట్టారు. దీంతో ఆమె రూ.1.6కోట్లు నిందితుల ఖాతాకు పంపారు. మోసపోయానని తెలుసుకుని ఫిర్యాదు చేశారు. జులైలో నమోదైన ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశాం. సాగర్ ప్రజాపతి, నాథో భాయ్ అరెస్టు కాగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.10లక్షలు, పాస్ బుక్‌లు, నకిలీ షెల్ కంపెనీల స్టాంపులు స్వాధీనం చేసుకున్నాం.
మరో కేసులో ఇన్వెస్ట్మెంట్ పేరుతో కేటుగాళ్లు మోసానికి తెరతీశారు. తాము చెప్పినట్టు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కాజేశారు. ముందుగా ఆరు, ఏడు సార్లు కొంత లాభాలు ఇచ్చి ఆపై పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టగానే బాధితుడిని మోసం చేశారు. ఈ కేసులో రామ్ కోటికి చెందిన వ్యాపారి నుంచి ఏకంగా రూ.2కోట్లు కొట్టేశారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశాం" అని తెలిపారు.
Updated Date - Aug 24 , 2024 | 07:29 PM