KTR: తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం.. ఎందుకంటే?

ABN, Publish Date - Aug 26 , 2024 | 09:38 AM

తెలంగాణలో డెంగ్యూ(Dengue) మరణాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.

KTR: తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం.. ఎందుకంటే?
BRS working president KTR

హైదరాబాద్: తెలంగాణలో డెంగ్యూ(Dengue) మరణాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందంటూ మండిపడ్డారు. కుళ్లిన కోడిగుడ్లు పెడుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.


డెంగ్యూ మరణాలు లేవని చెప్తారా?

డెంగ్యూ నిన్న(ఆదివారం) ఐదుగురు చనిపోయారని, ఇవాళ మరో ముగ్గురు మృతిచెందారంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసలు డెంగ్యూ మరణాలే లేవంటూ చెబుతోందని మండిపడ్డారు. ఈ మేరకు వార్తా పత్రికలకు సంబంధించిన క్లిపింగులను ఆయన తన ట్విట్‌కు జత చేశారు. మరణాల డేటాను ఎవరు దాస్తున్నారు, ఎందుకు దాస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మరోవైపు ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఆస్పత్రుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు, నలుగురు పేషంట్లు పడుకుంటున్నారని ఆగ్రహించారు. దీని ద్వారా డెంగ్యూ సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు.


అవి తింటే పిల్లల పరిస్థితేంటి?

మరోవైపు రాష్ట్రంలో చిన్నారుల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన కోడిగుడ్లు ఇస్తూ పిల్లల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. ఈ మేరకు షరత్ రెడ్డి అనే నెటిజన్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ జత చేశారు. "భువనగిరి, పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు కుళ్లిన కోడిగుడ్లు ఇచ్చారు. వాటిని తింటే చిన్నపిల్లల పరిస్థితి ఏంటి?. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ?. మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్లు?. ఓ వైపు గురుకులాల్లో మరణాలు.. మరోవైపు అంగన్వాడీల్లో అడుగడుగునా అలసత్వం. పిల్లల పాలిట కాంగ్రెస్ సర్కార్ యమపాశంగా తయారైంది" అంటూ షరత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తన ట్వీట్‌కు జత చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

HYDRA: చెరువుల చెర.. వారి పనే!

CM Revanth Reddy: ఆక్రమణల కూల్చివేతలు.. భగవద్గీత స్ఫూర్తితోనే..

Updated Date - Aug 26 , 2024 | 09:41 AM

Advertising
Advertising
<