KTR: ఆ భూములు లాక్కుంటే ఊరుకోం.. రేవంత్‌కు కేటీఆర్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Nov 23 , 2024 | 02:19 PM
భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు , చిన్నపిల్లలు అని తేడా లేకుండా రేవంత్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. పేదవారి భూములను లాక్కుంటే ఊరుకోము వారికి తాము అండగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్: పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత (BRS Leader) పట్నం నరేందర్ రెడ్డి జైలు పాలయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తెలిపారు. వికారాబాద్ (Vikarabad) జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి కేసులో పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ (Arrest) చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ (KBR Park)లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కేటీఆర్ ఇవాళ(శనివారం) ఉదయం 11గంటలకు చర్లపల్లి జైలుకు వెళ్లారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. కేటీఆర్‌తో పాటు చర్లపల్లికి మాజీమంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఇతర నేతలు వెళ్లారు. ములాఖత్ తర్వాత చర్లపల్లి జైలు వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.
అమాయకులు జైల్లో ఉన్నారు..
‘‘పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మాతో ఒకే విషయాన్ని ప్రస్తావించారు. నా గురించి వదిలేయండి. చేయని తప్పుకు జైల్లో ఉన్నటువంటి 30 మంది రైతులను విడిపించాలని పట్నం నరేందర్ రెడ్డి కోరారు. గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారు వారికి అండగా నిలవాలని కోరారు. సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారు. కొడంగల్ నుంచి కొండ రెడ్డి పల్లి దాకా అరాచకాలు చేస్తున్నవారు గద్దెనెక్కి కూర్చున్నారు. భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లో చొరబడి ఆడవాళ్లు , చిన్నపిల్లలు అని తేడా లేకుండా రేవంత్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో నిన్న సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ మృతి చెందారు. ఇంటిముందు దారి లేకుండా గోడలు కడితే మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. నా సొంత ఊరు నా సొంత నియోజకవర్గం అని ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు చూస్తూ ఉండరు. నువ్వు చక్రవర్తివి కాదు.. నువ్వు కూడా కొట్టుకొని పోతావు. పేదవారి భూములను లాక్కుంటే ఊరుకోము వారికి మేము అండగా ఉన్నాం. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే బాధ్యత మీపై ఉంది’’ అని కేటీఆర్ తెలిపారు.
Updated Date - Nov 23 , 2024 | 02:26 PM