KTR :ఆ దాడిని ఖండిస్తున్నా.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
ABN, Publish Date - Dec 10 , 2024 | 02:22 PM
తెలంగాణ పోలీసులకు మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పోలీసుల చర్యను వదిలిపెట్టమని హెచ్చరించారు. మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
హైదరాబాద్: కరోనా లాంటి మహమ్మారి పరిస్థితిల్లోనూ ఆశా వర్కర్లు ధైర్యంగా పని చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లును ఉస్మానియా ఆస్పత్రిలో ఇవాళ(మంగళవారం) కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... తమ ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని ఆశా వర్కర్లు అడిగారని అన్నారు. ఎన్నికల.సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
నిన్న నిరసన చేస్తే ఆశా వర్కర్లపై దాడి చేశారని అన్నారు. మగ పోలీసులు మహిళలను కొట్టారని తెలిపారు. ఏసీపీ ఇగో దెబ్బతిందో ఏంటో తెలియదన్నారు. హోంశాఖ కూడా సీఎం రేవంత్‌రెడ్డి చేతిలోనే ఉందని అన్నారు. లా అండ్ ఆర్డర్ ఉందా ఈ రాష్ట్రంలో సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని విమర్శించారు. నిన్న జరిగింది దుశ్శాసన పర్వమని మండిపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ పోలీసుల చర్యను వదిలిపెట్టమని హెచ్చరించారు. మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవసరమైతే జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామన్నారు. వారికీ ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీలో కొట్లడుతామన్నారు. ఇక్కడ వైద్యం అందకపోతే తాము మీకు అండగా ఉండి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సచేయిస్తామని హామీ ఇచ్చారు.
ఆశావర్కర్లపై దాడి...
కాగా.. కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు అందింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్, సీఐ శ్రీనివాస్ చారిలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు. జీతాలు పెంచాలంటూ నిరసన చేస్తున్న ఆశా కార్యకర్తలపై పోలీసులు పరిధి దాటి వ్యవహరించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకరంగా భౌతిక దాడి చేసి దారుణంగా కొట్టారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు విజ్ఞప్తి చేశారు.
ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తత...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేలు ఫిక్స్‌డ్ జీతం ఇవ్వాలని ఆశా కార్యకర్తలు ఇవాళ (సోమవారం) హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నిరసన కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఆశా కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పెద్దఎత్తున తోపులాట జరిగింది. దీంతో ఇద్దరు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసాచారి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆశా వర్కర్ల ఆరోపించారు.
Updated Date - Dec 10 , 2024 | 02:23 PM