TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..
ABN , Publish Date - Sep 15 , 2024 | 03:45 PM
హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గత కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరంటూ సాగిన ఉత్కంఠకు తెరపడినట్లు అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రెటరీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. పదవీ బాధ్యతల అనంతరం మహేశ్ కుమార్ గౌడ్‍కు సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందలు తెలిపారు.
ఈ ఏడాది జులై 7న అప్పటివరకూ టీపీసీసీ చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. దీంతో ఆ స్థానం కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. వీరిలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపించాయి. వీరంతా పదవి కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయితే అనూహ్యంగా పార్టీ అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ పేరు ప్రకటించింది. ఆయన నియామకాన్ని తెలియజేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ప్రకటన సైతం విడుదల చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం
Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం