TG Govt: మహిళలకు ప్రభుత్వం కీలక ప్రకటన
ABN, Publish Date - Aug 03 , 2024 | 07:20 PM
తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రకటించారు. ముదిగొండ మండలం కమలాపురంలో మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో భట్టి మాట్లాడుతూ... మధిర నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. అంగన్ వాడీలో 3 వ తరగతి వరకు ఏర్పాటు చేసి నాల్గోతరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు పంపించే ఏర్పాటుకు నాంది పలికామని అన్నారు.
అలాంటి పాఠశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ డైరీ చిరకాల వాంఛ ఇదని వివరించారు. నియోజకవర్గంలోని మహిళలను పాడి పరిశ్రమలో వాటాదారులుగా చేసి వారిని పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి 2014కు ముందే ఇందిరమ్మ డైరీని ప్రవేశ పెట్టామని వెల్లడించారు. నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు గేదెలు ఇచ్చి వారిని పరిశ్రమలో వాటా దారులుగా చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. నియోజకవర్గంలో మిగిలిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభిస్తామని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఎస్సీ వర్గీకరణపై చర్చ..
మరోవైపు.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు. తీర్పును ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం సీఎం తనను పిలిచి కమిటీ వేసి, మాదిగ జాతికోసం ముందుకు వెళ్లాలని సూచించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఈ అంశంలో వాదనలు వినిపించడంలో భాగమైందని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ జాతి ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తాము సమానత్వం కోసం పోరాటం చేస్తున్నామని ఉద్ఘాటించారు. జాతినే అంటారని తనమంటే దుర్మార్గమని తీవ్రంగా వ్యతిరేకిస్తాం, ఖండిస్తామని అన్నారు. న్యాయ నిపునులతో కమిటీ వేసి నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికు సమర్పిస్తామని వివరించారు. ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో మాదిగ సమ్మేళనం నిర్వహించి.. సీఎం రేవంత్‌రెడ్డికి సన్మానం చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
Updated Date - Aug 03 , 2024 | 07:27 PM