TG News: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ.. కారణమిదే..?
ABN, Publish Date - Jul 07 , 2024 | 10:03 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఈరోజు(ఆదివారం) మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన అంశాలపై చర్చించారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu)ను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఈరోజు(ఆదివారం) మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన అంశాలపై చర్చించారు. రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు జలవనరులు రైల్వే లైన్ల పై చర్చించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు అక్కడ నుంచి పులిచింతల, నాగార్జున సాగర్‌కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్‌లో కీలకమని తెలిపారు.
పట్టిసీమ టూ పులిచింతల లింక్‌తో శ్రీశైలం నీళ్లు రాయలసీమ సాగు నీటి కష్టాలు తీరడంతో పాటు తెలంగాణకు మేలు జరుగుతుందని వివరించారు. సత్తుపల్లి టూ కోవూరు రైల్వే లైన్ , పెనుబల్లి టూ కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని తుమ్మల సూచించారు. రైల్వే లైన్‌తో బొగ్గు రవాణా పుణ్య క్షేత్రాలు సందర్చించే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. కొత్తగూడెం టూ పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయిందని, ఏపీలో రైల్వేపై దృష్టి పెట్టాలని తుమ్మల సూచించారు. ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లా విడిపోయినా అభివృద్ధిలో కలసి సాగాలని చర్చించారు.
జల వివాదాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందని తుమ్మల అన్నారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతపై చంద్రబాబుకు మంత్రి తుమ్మల వివరించారు. తెలుగు రాష్ట్రాలు తల ఎత్తుకుని ఉండేలా అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.చంద్రబాబు నాయుడుతో ఎంతో ఆప్యాయత భేటీ సాగిందని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Updated Date - Jul 07 , 2024 | 10:03 PM