Padi Koushik Reddy:ఆయన చిట్టా మొత్తం నా దగ్గర ఉంది.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాస్ వార్నింగ్
ABN, Publish Date - Dec 02 , 2024 | 08:55 PM
హుజురాబాద్ ఏసీపీ దళితులను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఏసీపీ చిట్టా మొత్తం నా దగ్గర ఉందని హెచ్చరించారు. పోలీసులు బెదిరింపులకు తాము భయపడమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: దళితబంధుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మాజీ సీఎం కేసీఆర్ తీసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. మొదటి విడత దళిత బంధు లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళితబంధు ఇవ్వాలని తాను అసెంబ్లీలో అడిగానని గుర్తుచేశారు. తెలంగాణలో రెండు లక్షల మందికి దళితబంధు ఇచ్చామని చెప్పారు. రెండో విడత దళితబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ధ్వజమెత్తారు. దళితబంధుతో అనేక మందికి లబ్ధి జరిగిందని తెలిపారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...33 జిల్లాల్లో దళితబంధు ఆపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధును తాను ఆపానని అంటున్నారని అన్నారు. దళితబంధు రూ.12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని చెప్పారు. దళితబంధు విడుదల చేయాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దళితులు వినతిపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ పథకాలు తాము ఇవ్వమని మంత్రులు అంటున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు అడిగితే ఎఫ్.ఐ.ఆర్ బుక్ చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
దళిత మహిళలపై కేసులు పెట్టారని అన్నారు. హుజురాబాద్ ఏసీపీ దళితులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. హుజూరాబాద్ ఏసీపీ చిట్టా మొత్తం తన దగ్గర ఉందని హెచ్చరించారు. పోలీసులు బెదిరింపులకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు. తాము రాష్ట్ర, జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలుస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల కేసులపై దళిత సంఘాలు స్పందించాలన్నారు. స్థానిక ఏసీపీ, సీఐలపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు ఇచ్చే వరకు తాను పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు
Updated Date - Dec 02 , 2024 | 09:23 PM