Allu Arjyn: పోలీస్ స్టేషన్‌కు పుష్ప.. రోజూ వెళ్లాల్సిందేనా
ABN , Publish Date - Dec 24 , 2024 | 08:38 AM
అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడం కలకలం రేపింది. ఈకేసులో అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందటంతో పోలీసులు మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ నటుడు అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఎ11గా పేర్కొన్నారు. పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా న్యాయమూర్తి 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈలోపు హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. తాజాగా కేసు విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడంతో.. అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో సంప్రదింపులు జరిపారు. చివరకు ఇవాళ విచారణకు హాజరుకావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ విచారణకు సహకరించాలని చెప్పడంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు లీగల్ టీమ్ కూడా వెళ్లనుంది. ఓ వైపు సంధ్య థియేటర్ ఘటనలో మహిళ చనిపోయిన విషయాన్ని ముందుగానే పోలీసులు అల్లు అర్జున్‌కు చెప్పారని ప్రభుత్వం చెబుతుండగా.. తనకు తరువాతి రోజు మహిళ మృతి చెందిందనే విషయం తెలిసిందని బన్ని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విచారణలో ఏయే ప్రశ్నలు అడగనున్నారనేది ఆసక్తిగా మారింది.
రోజూ విచారణకు వెళ్లాల్సిందేనా..
ఏదైనా కేసులో నిందితుడికి జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తే అతడిని విచారించేందుకు పోలీసులు కస్టడీ కోసం కోర్టును ఆశ్రయిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉండటంతో కేసు విచారణ కోసం నేరుగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. జ్యూడిషియల్ కస్టడీలో ఉంటే పోలీసులు కేసు తీవ్రత ఆధారంగా ఎన్ని రోజులు విచారించాలో అంచనా వేసి నిందితుడి కస్టడీ కోరతారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉండటంతో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అల్లు అర్జున్‌ను వరుసగా విచారణకు పిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇవాళ విచారణకు వెళ్లిన తర్వాత రేపు రావాలని పోలీసులు కోరతారా.. లేదంటే మరోసారి నోటీసులు జారీచేసి మరో తేదీన విచారణకు రమ్మని పిలుస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ రద్దు కోసం కోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కోర్టు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేస్తే.. ఆయనను మరోసారి అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here