Vemula Prashanth Reddy: అరికెపూడి గాంధీకి పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం దుర్మార్గం..
ABN, Publish Date - Sep 10 , 2024 | 05:31 PM
ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అనాదిగా వస్తోందని ఆయన చెప్పారు.
హైదరాబాద్: ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చే సంప్రదాయం అనాదిగా వస్తోందని ఆయన చెప్పారు. అలాంటిది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఏ విధంగా ఇస్తారని వేముల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపకూడదనే దురుద్దేశంతోనే పదవిని గాంధీకి కట్టబెట్టినట్లు మాజీ మంత్రి ఆరోపించారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వడం రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఎలా కేటాయిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి వేముల నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీకి ఆ పదవి ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వ లోపాలు ప్రజలకు తెలియకూడదనే ప్రతిపక్షానికి పదవి ఇవ్వలేదు. ఎన్నికల విధానంలో జరగాల్సిన పీఏసీ ఏర్పాటు సెలక్షన్ ప్రాసెస్‌లో జరిగింది. మా పార్టీ నేత హరీశ్ రావు నామినేషన్ వేస్తే తిరస్కరించారు. ఆ పదవి కోసం నాలుగు నామినేషన్లు వచ్చినా ఎన్నికలు ఎందుకు జరగలేదు.
శాసనసభ సంప్రదాయాలు తుంగలో తొక్కారు. అరికెపూడి గాంధీ.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం ప్రపంచమంతా చూసింది. ఆయన కాంగ్రెస్‌లో చేరిన వార్త అన్ని పత్రికల్లో వచ్చింది. పత్రికల్లో వచ్చినప్పుడు గాంధీ ఎందుకు ఖండించలేదు. పార్టీ మారిన నేతకు పీఏసీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను పీఏసీ ఛైర్మన్‌గా నియమించారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో ఒక రాజ్యాంగం తెలంగాణలో మరో రాజ్యాంగం ఉందా?. రాజ్యాంగాన్ని కాపాడుతానంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. అనర్హత వేటు వేయాలని మేము ఇచ్చిన పిటిషన్ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉండగా ఆయనకు పదవి ఎలా ఇచ్చారు. నాకేంటి సిగ్గు అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఉంది. పీఏసీలో హరీశ్ రావు ఉంటే మీకు భయమెందుకు?. గాంధీని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తున్నారు" అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: ఏబీఎన్- ఆంధ్రజ్యోతి కథనానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందన.. కీలక ఆదేశాలు
KTR: 499మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు: ఎమ్మెల్యే కేటీఆర్..
Sridharbabu: పీఏసీ చైర్మన్ నియామకంపై మంత్రి శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Updated Date - Sep 10 , 2024 | 05:34 PM