Gates Opening: జూరాల 17గేట్లు ఎత్తివేత
ABN, Publish Date - Jul 21 , 2024 | 03:38 AM
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా శనివారం 17 గేట్లను ఎత్తారు. 1,04,416 క్యూసెక్కులను దిగువకు వదిలారు.
ఈ ఏడాది ఇదే తొలి.. శ్రీశైలానికి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలకు లక్ష క్యూసెక్కులు
మేడిగడ్డకు కొనసాగుతున్న వరద.. 3.73 లక్షల క్యూసెక్కులు
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్టు అయిన జూరాల గేట్లు తెరుచుకున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా శనివారం 17 గేట్లను ఎత్తారు. 1,04,416 క్యూసెక్కులను దిగువకు వదిలారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 48,026 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. నారాయణపూర్ జలాశ యానికి 1,11,236 క్యూసెక్కుల వరద వస్తుండగా 1,08,860 క్యూసెక్కులను కిందకు వదిలారు. ఆల్మట్టికి 1,05,939 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. మరోవైపు తుంగభద్రకు 1,03,956 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
రోజూ 10 టీఎంసీల వరద వచ్చి చేరుతోంది. ఇది కొనసాగితే నాలుగు రోజులలో తుంగభద్ర జలాశయం నిండనుంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. భద్రాచలం వద్ద గోదావారి 40 అడుగులకు సమీపించింది. మూడు రోజులుగా గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే స్నానఘట్టాలు నీట మునిగాయి. ఛత్తీ్‌సగఢ్‌తో పాటు, చర్ల మండలంలో భారీ వర్షాలతో తాలిపేరు 25 గేట్లను పూర్తిగా ఎత్తి లక్ష 45వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మూసీకి ఇన్‌ఫ్లో శనివారం రెట్టింపైంది. నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 504.60 అడుగులు (122.6854టీఎంసీలు)గా ఉంది. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లను ఎత్తారు.
Updated Date - Jul 21 , 2024 | 03:38 AM