Medigadda: సమయం లేదు మిత్రమా!
ABN, Publish Date - May 26 , 2024 | 05:16 AM
మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్ పునాదుల కింద అగాధం ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చి పునాదులను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడి, మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2వారాల సమయం మాత్రమే ఉంది.
రాష్ట్రంలో వర్షాలకు 2 వారాలే సమయం.. ఈలోగా మేడిగడ్డ పునాది చక్కదిద్దాలి
ఏడో బ్లాక్ కింద 10 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపాలి
4 గేట్లు తొలగించేందుకు ఏర్పాట్లు
పునాది వరకు 2వైపులా రేకులు దింపాక కాంక్రీట్ గ్రౌటింగ్
యుద్ధ ప్రాతిపదికన పనులు
మీడియాకు అనుమతి నిరాకరణ
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్టు ఏడో బ్లాక్ పునాదుల కింద అగాధం ఏర్పడిన నేపథ్యంలో వాటిని పూడ్చి పునాదులను పటిష్టం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాలు పడి, మేడిగడ్డ వద్ద ప్రవాహం మొదలు కావడానికి కేవలం 2వారాల సమయం మాత్రమే ఉంది. ఈలోగా పునాదులను పటిష్టం చేయకపోతే ఏడో బ్లాక్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే ఏడో బ్లాక్ కింద ఖాళీని పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం పది వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపాల్సి ఉంటుందని అంచనాకు వచ్చారు. పునాదుల కింద ఖాళీలోకి పవర్ ప్రెషర్ గ్రౌటింగ్ విధానంతో ఇసుక, నీటిని కలిపి పంపింగ్ చేస్తారు. తర్వాత ఏడో బ్లాక్ పొడవునా బ్యారేజీకి రెండు వైపులా భూమిలోకి ఉక్కు రేకులను(షీట్ ఫైల్స్) పునాదుల కింద వరకు దింపుతారు.
వీటిని ఇప్పటికే విశాఖ స్టీల్ కర్మాగారం నుంచి తెప్పించారు. ఉక్కు రేకులను దింపాక పునాది పైనుంచి సిమెంట్, ఇసుక, కాంక్రీట్ మిశ్రమాన్ని పంపింగ్ పద్ధతిలో లోపలికి పంపిస్తారు. దాంతో బ్యారేజీ లోపలి భాగంలో ఇసుక కొట్టుకుపోయి కింద ఖాళీ అవడం ఆగిపోతుంది. వర్షాకాలం వరదలకు బ్యారేజీ ఏడో బ్లాక్ కొట్టుకుపోకుండా ఉంటుంది. రాష్ట్రంలో వర్షాలు పడి వరదలు రావడానికి కేవలం 2 వారాల సమయం ఉంది. జూన్ 7 లేదా 8కల్లా రాష్ట్రంలో భారీ వర్షా లు పడి, గోదావరికి వరదలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో ఏకకాలంలో మూడు బ్యారేజీల్లో రాత్రనక... పగలన మరమ్మతు పనులు చేస్తున్నారు. మేడిగడ్డలో మొరాయించిన ఏడు గేట్లలో నాలుగింటిని కట్ చేసి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన మూడు గేట్లు బలవంతంగా ఎత్తనున్నారు. బ్యారేజీ కింద అగాధాన్ని ఇసుకతో పూడ్చేయడం, గేట్లను తెరిచి ఉంచటం, ఏడో బ్లాకు పొడవునా పునాదుల కింద వరకు ఉక్కు రేకులను దించడం, బ్యారేజీ పునాది పైన బోర్‌హోల్ డ్రిల్లింగ్ పద్ధతిలో రంధ్రాలు చేసి, పునాది అడుగుకు ఇసుక, కాంక్రీట్ మిశ్రమాన్ని పంపింగ్ చేయడం మొత్తం కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేస్తారు. 15 నుంచి 22వ నంబర్ వరకు మొత్తం 8 పిల్లర్ల మధ్య 7 గేట్లు మొరాయించా యి. 4 గేట్లను ముక్కలు చేసి తొలగిస్తారు.
కీలకంగా అన్నారం, సుందిళ్ల
ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా కాపాడుకోవడం తప్ప పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రస్తుతం బ్యారేజీ కింద ఖాళీని పూడ్చి కొట్టుకుపోకుండా కాపాడుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాశేశ్వరం లిఫ్ట్‌లద్వారా నీళ్లు అందించడంలో అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కీలకంగా మారాయి. దాంతో వీటి మరమ్మతులను వేగవంతం చేశారు. అన్నారంలో 11 మీటర్ల దాకా (5.5 టీఎంసీల) దాకా, అదే సుందిళ్లలో 9 మీటర్ల దాకా నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నారంలో భారీగా సీపేజీలు న్నాయి. అన్నారం, సుందిళ్ల రెండింటిలోనూ రక్షణ ఏర్పాట్లు దెబ్బతిన్నాయి. సుందిళ్లలో కూడా కొత్తగా సీపేజీలు బయట పడటంతో వాటి గ్రౌటింగ్ పనులను రాత్రనక, పగలనక చేయిస్తున్నారు. సీసీ బ్లాకులను సరి చేయడంతో పాటు అఫ్రాన్లను డిజైన్ ప్రకారం సరి చేస్తున్నారు. శనివారం సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థ అయున నవయుగ ప్రతినిధులతో ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూన్ 7లోగా గ్రౌటింగ్ పూర్తి చేయాలని చెప్పారు. శనివారం మూడు బ్యారేజీల రక్షణ మీద వేసిన కమిటీ సమావేశం ఈఎన్‌సీ (జనరల్) అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జలసౌధలో జరిగింది. ప్రస్తుతం చేస్తున్న గ్రౌటింగ్ పనులకు ఎన్‌డీఎ్‌సఏ అనుమతి కోరుతూ లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బ్లాక్-7 దిగువన ఉబికివస్తున్న జలాలు
మహదేవపూర్ రూరల్: మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో 20వ నెంబరు పిల్లరు ప్లాట్‌ఫామ్ ఎదురుగా గురువారం గొయ్యి పడగా పూడ్చేసిన అధికారులు చుట్టూ నిషేధిత ప్రాంతంగా హెచ్చరిస్తూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా, బ్లాక్-7కు దిగువన ఫ్లాట్‌ఫామ్ కింది నుంచి నీళ్లు ఉబుకుతున్నాయి. బ్యారేజీ కింద ఉండే అగాధం ద్వారా నీరు ఇవతలి వైపునకు వస్తుందని భావిస్తున్నారు. ఓ ఇంజనీరింగ్ అధికారిని వివరణ అడగ్గా గతంలో ఏర్పడిన సీఫేజ్, గోతుల వల్ల బ్యారేజీ కుంగిందని.. దాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించక పోవడం వల్లే సీఫేజ్ ఉందని చెప్పుకొచ్చారు. బ్యారేజీ దిగువన సిమెంట్ కాంక్రీట్ బ్లాక్‌లను పెడుతున్నారు. బ్యారేజీకి ఎగువన బ్లాక్-7 వైపు గతంలో ఏర్పాటు చేసిన మట్టి కట్ట ఎత్తును పెంచినట్లు సమాచారం. శనివారం కూడా పలువురు మీడియా ప్రతినిఽధులు కవరేజీకి వెళ్లగా అనుమతించలేదు.
Updated Date - May 26 , 2024 | 05:16 AM