Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?
ABN, Publish Date - Aug 16 , 2024 | 04:22 AM
కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
పదేళ్లలో చేయలేని రుణమాఫీని నెలల్లో చేస్తే ఎందుకు ఏడుపు?
ఉప ఎన్నికల భ్రమల్లో కేసీఆర్, కేటీఆర్
ఫిరాయింపులపై కేసీఆర్ నెలకొల్పిన సంప్రదాయాన్నే రేవంత్ కొనసాగిస్తున్నారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్,ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉంటే ఫాంహౌస్, లేకపోతే ఉప ఎన్నికలు.. ఇదే బీఆర్‌ఎస్ సిద్ధాంతం అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం.. అధికారంలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం.. ఇదీ కాంగ్రెస్ సిద్ధాంతం అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లలో చేయలేని రుణమాఫీని రేవంత్ ప్రభుత్వం 8నెలల్లో.. ఒకే కిస్తీ లో అదీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తే ఎందుకు ఏడుపు? అని ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు.
గురువారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉండాలనే ఆలోచన బీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై విసుగుచెందే ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టారని చెప్పారు. సోనియా, రాహుల్ నిర్ణయించుకొని సీఎంగా రేవంత్‌ను చేశారని, ఆ అగ్రనేతల మార్గదర్శకత్వంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. కేటీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. ఉప ఎన్నికలు వస్తాయనే మత్తులో ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్ హ యాంలో శాఖలవారీగా జరిగిన నష్టాన్ని రేవంత్ సర్కా రు సవరించుకుంటూ వస్తోందన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా కూడా బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం తగ్గలేదన్నారు.
‘లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేతలకు ప్రజలు ఒక్కసీటూ ఇవ్వలేదు. సొంత జిల్లా అని చెప్పుకునే ఉమ్మడి మెదక్‌లోనూ ఓటమిపాలయ్యారు. ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఎక్కడున్నావ్?’ అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్‌ఎస్ అని.. కేసీఆర్ తెచ్చిన సంప్రదాయా న్నే రేవంత్ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం నాలుగున్నరేళ్ల సమయంఉందని.. తొందరపడొద్దని.. అబద్ధాలు చెప్పడం మానేయాలని.. ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలకు హితవుపలికారు.
రాహుల్ గాంధీ తెలంగాణకొచ్చి ప్రచా రం చేస్తేనే ఇక్కడి నేతలను ప్రజలు గెలిపించారన్నారు. సీఎం, మంత్రులు మంచి పరిపాలన చేస్తున్నారనిన్నారు. తమ అధిష్టానం ఢిల్లీలో ఉంటుందని.. పిలుపొస్తే ఢిల్లీకి వెళ్లి కలుస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలిశారని గుర్తుచేస్తూ.. ‘‘మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా’’? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం.. ఇచ్చిన మాట ప్రకారం గురువారం (ఆగస్టు 15) నాటికి రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసిందన్నారు.
Updated Date - Aug 16 , 2024 | 04:22 AM