Jagga Reddy: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం.. దేశప్రజలకు రక్షణ కవచం
ABN, Publish Date - Dec 22 , 2024 | 05:00 AM
‘‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందరికీ అందేలా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూస్తోంది.
ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తేయాలని చూస్తోంది.. అందుకే రాహుల్ గాంధీ పోరాటం
పార్లమెంటులో స్పీకర్ సాక్షిగా అంబేడ్కర్‌ను అమిత్‌షా కించపరిచారు
షా మాటలను మోదీ సమర్థించి.. బాబా సాహెబ్‌ను మరింత అవమానించారు
వారిద్దరూ క్షమాపణ చెప్పేదాకా పోరాటం
నెహ్రూ క్యాబినెట్లో ఉన్న అంబేడ్కర్‌ను అవమానించినందుకే రాహుల్ పోరాటం
దళితుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించిన చరిత్ర సోనియా, రాహుల్‌ది
హిందూ, ముస్లిం, సమస్త కులాలు, జాతుల సమైక్యతనే రాహుల్ ఆకాంక్ష
అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా.. సంగారెడ్డిలో జగ్గారెడ్డి భారీ ర్యాలీ
సంగారెడ్డి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు అందరికీ అందేలా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశప్రజలకు ఒక రక్షణ కవచంలా మారింది. ఈ రాజ్యాంగాన్ని బీజేపీ ఎత్తివేయాలని చూస్తోంది. అందుకే రాహుల్‌గాంధీ పోరాడుతున్నారు’’ అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో స్పీకర్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కించపరిచారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్సీ, ఎస్టీలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి జగ్గారెడ్డి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమిత్‌షా మాటలను ప్రధాని మోదీ సమర్థించడం గర్హనీయమని, బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను మరింత అవమానపరిచారని మండిపడ్డారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరిచిన మోదీ, అమిత్‌షాలు క్షమాపణలు చెప్పేదాకా రాహుల్ గాంధీ నేతృత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. తొలి ప్రధాని నెహ్రూ క్యాబినెట్లో ఉన్న అంబేడ్కర్‌ను అవమానించినందుకే నెహ్రూ మునిమనవడిగా రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తున్నారన్నారు. హిందూ, ముస్లిం, సమస్త కులాలు, జాతుల సమైక్యతను సాధించడమే రాహుల్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షు డిగా ఒక దళితుడైన ఖర్గేను నియమించిన చరిత్ర సోనియా, రాహుల్ గాంధీలదని కొనియా డారు. కానీ దళితుడిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడానికి మోదీ, అమిత్‌షాలకు దమ్ముందా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Updated Date - Dec 22 , 2024 | 05:00 AM