Jaggareddy: ఉత్తమ్ శ్వేతపత్రం లాంటివారు..
ABN, Publish Date - May 24 , 2024 | 03:09 AM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డిని ఎవరూ డిస్టర్బ్ చేయరు
ఐదేళ్లు ఆయనే ముఖ్యమంత్రి : జగ్గారెడ్డి
ఆయనపై ఏలేటి నిరాధార ఆరోపణలు
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం లాంటి వారని.. ఆయనపై ఇంక్ చల్లవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. ఉత్తమ్ మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మహేశ్వరెడ్డికి ఎందుకు కోపమొచ్చిందో..? అర్థం కాలేదన్నారు. మంత్రిపై నిరాధార అభియోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరెడ్డి ఇప్పటికైనా ఆరోపణలు ఆపితే మంచిదని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలు పడి ధాన్యం తడిసిందని.. అయినప్పటికీ తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారని గుర్తు చేశారు. రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడొద్దని, నష్టపోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కొనసాగుతారని.. ఆయనను ఎవరూ డిస్టర్బ్ చేయరని జగ్గారెడ్డి అన్నారు.
Updated Date - May 24 , 2024 | 03:13 AM