MLC KAVITHA: నీ సంగతి చెబుతా.. ఆ ఎమ్మెల్యేకు కవిత మాస్ వార్నింగ్
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:37 PM
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ బొమ్మతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు తెచ్చారని కవిత ప్రశ్నించారు.
జగిత్యాల: ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు.. మాజీ సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లినవ్ సంజయ్ అని ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ఏడాది నుంచి నాయోజకవర్గం కోసం రూపాయి తేలేదు.. ఎందుకు పోయినవ్ బాబు అని నిలదీశారు. ప్రజలను వదిలి.. పైసల కోసం వెళ్లినోడు నాయకుడా అని ధ్వజమెత్తారు. తట్టేడు మట్టి తీయలేదు..అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని పోతావ్ అని కవిత ప్రశ్నించారు.
రూపురేఖలు మార్చి అవమానించారు..
కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి, అవహేళన చేస్తున్నారని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అంశంపై ఆమె రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ తల్లి పేరుతో రేవంత్ ఏర్పాటుచేసిన రూపాన్ని కాంగ్రెస్ మాతగా నామకరణం చేద్దామని కవిత తీర్మానించారు. బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేయడం తెలంగాణ సంస్కృతిపై దాడేనని, దీన్ని తెలంగాణ సమాజమంతా వ్యతిరేకించాలని కవిత పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలకులు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రజలందరినీ అవమానించారని కేవీ రమణాచారి ఆరోపించారు.
తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడాన్ని చరిత్ర హర్షించదని ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారిణి తిరునగరి దేవకీదేవి చెప్పారు. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాలను తాకితే జనం చూస్తూ ఊరుకోరని, తిరగబడతారని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ హెచ్చరించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడమంటే శిల్పిగా తనను చంపేసినట్టేనని తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారి చెప్పారు. కార్యక్రమానికి తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ సభాధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, దళిత స్త్రీవాద రచయిత్రి గోగు శ్యామల, విశ్లేషకుడు వి. ప్రకాష్, ఆచార్య కె. సీతారామారావు, సీనియర్ జర్నలిస్టులు టంకశాల అశోక్,వేణుగోపాల స్వామి, జమాతే ఇస్లామీ ప్రతినిధి హమీద్ ముహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 12:54 PM