TG News: కమల వికాసం.. కాంగ్రెస్ దరహాసం..
ABN, Publish Date - Jun 05 , 2024 | 05:08 AM
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్‌ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది.
కారు జీరో.. హైదరా‘బాద్‌షా’ మజ్లిసే.. కాషాయ పార్టీకి ‘డబుల్ ధమాకా’
ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయకేతనం.. హస్తం పార్టీకీ ఎనిమిది పార్లమెంటు స్థానాలు
దారుణంగా దెబ్బతిన్న బీఆర్‌ఎస్
కేసీఆర్ ఇలాకా మెదక్‌లోనూ ఓటమి
మల్కాజిగిరిలో ఈటల ఘనవిజయం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కమలం వికసించింది.. కాంగ్రెస్ మురిసింది.. గులాబీ వాడింది. తెలంగాణలో కమలం, హస్తం పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ సాధించాయి. ఓట్లు, సీట్లలో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు నుంచి ఎనిమిది సీట్లకు పెరగడంతోపాటు ఓట్ల శాతమూ21 శాతానికి ఎగబాకింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లలో విజయకేతనం ఎగరేసింది. పదేళ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పిన బీఆర్‌ఎస్ మాత్రం ఈసారి బొక్కబోర్లా పడింది. ఒక్క సీటును కూడా సాధించలేక చతికిలపడింది. ఓట్ల శాతమూ దారుణంగా తగ్గిపోయింది. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార కాంగ్రె్‌సలకు చెరో ఎనిమిది సీట్లు ఇచ్చి ‘సమ ధర్మం’ పాటించారు. ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
బీజేపీ అభ్యర్థుల జయకేతనం..
దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు కలిగిన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితామహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ ఉన్నా.. ఆ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి రెండోసారి పాగా వేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 52,792 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడంతో.. కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను తమ పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. అయినా కిషన్‌రెడ్డి గెలుపును అడ్డుకోలేకపోయింది. కాగా, నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిపై లక్షా 9వేల 241 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీని సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రధాని మోదీ కరిష్మా, పసుపు బోర్డు ఏర్పాటు.. అర్వింద్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి.
ఉత్కంఠ పోరులో డీకే అరుణ గెలుపు
మహబూబ్‌నగర్ పార్లమెంటు స్థానం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయకేతనం ఎగురవేశారు. ఫలితంపై చివరిదాకా ఉత్కంఠ కొనసాగిన ఈ స్థానంలో ఆమె తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై 4500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొంపదారు. రౌండ్, రౌండ్‌కు ఆధిక్యం ఇరువురి మధ్య మారుతూ వచ్చింది. ఈవీఎం ఓట్లలో డీకే అరుణకు 1800 మెజారిటీ మాత్రమే రాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో మెజారిటీ మరింత పెరిగింది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుపై 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెదక్‌లో రఘనందన్‌రావు జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ఆదిలాబాద్ గడ్డపై బీజేపీ మరోసారి సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి గోడం నగేష్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 2,22,170 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌పై విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి బూర నర్సయ్య గట్టి పోటీ ఇచ్చారన్న ప్రచారం జరినప్పటికీ ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. కాగా, పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,771 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గొమాసే శ్రీనివా్‌సపై విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.
ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభంజనం..
ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847ఓట్ల ఆధిక్యంతో బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఘనవిజయం విజయం సాధించారు. ఖమ్మంలో కాంగ్రె్‌సకు ముగ్గురు మంత్రుల రూపంలో బలమైన నాయకత్వం, ఓటుబ్యాంకు ఉండడంతో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ భారీ ఆధిక్యాలను సొంతం చేసుకుంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగిన సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సోదరుడైన డాక్టర్ మల్లురవి విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌పై 94,914 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అరూరి రమే్‌షపై 2,19,691 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో వరంగల్‌లో 15 ఏళ్ల తరువాత కాంగ్రె్‌సకు గెలుపు లభించినట్లయింది. మహబూబాబాద్‌లో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ తన సమీప ప్రత్యర్థి మాలోతు కవితపై 3,46,089 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ 47,893 ఓట్ల మెజార్టీతో సిటింగ్ ఎంపీ బీబీ పాటిల్‌పై గెలుపొందారు. బీబీ పాటిల్ బీఆర్‌ఎ్‌సను వీడి బీజేపీలో చేరినా ఓటమిని తప్పించుకోలేకపోయారు.
ఫలితాలు నిరాశ కలిగించాయి ఫినిక్స్ పక్షిలాగా పుంజుకుంటాం: కేటీఆర్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అయితే దీంతో కుంగిపోకుండా మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న నమ్మకం తమకు ఉందని మంగళవారం ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన తెలిపారు. ఫినిక్స్ పక్షిలా తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమకు అతిపెద్ద గౌరవమని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ స్థాపించాక ఈ 24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామని, అద్భుత విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నామని చెప్పారు. తాము 2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018 లో 88 స్థానాలతో రెండోసారి గెలుపొందామన్నారు. అలాగే ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
Updated Date - Jun 05 , 2024 | 05:08 AM