Khammam: పరిహారానికి ముందే చకచకా పనులు
ABN, Publish Date - Aug 11 , 2024 | 04:18 AM
భూసేకరణ ప్రారంభం కాకుండానే ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింక్ కెనాల్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.
తుది దశకు సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం
తుమ్మల భరోసాతో రైతుల సహకారం
15న సీఎం చేతుల మీదుగా సీతారామ పంప్‌హౌ్‌సల ప్రారంభం
నేడు మోటార్ల ట్రయల్ రన్: ఉత్తమ్
ఖమ్మం, హైదరాబాద్, ఆగస్టు10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూసేకరణ ప్రారంభం కాకుండానే ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింక్ కెనాల్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. రెండున్నర నెలల క్రితం ప్రారంభమైన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ లింక్ కెనాల్ ద్వారా సీతారామ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసిన గోదావరి జలాలను సాగర్ కాలువతో అనుసంధానం చేయనున్నారు. నిజానికి ఈ కాలువ పనులు చేపట్టేందుకు రైతుల నుంచి 172 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
తొలుత తమకు ఎంత పరిహారం ఇస్తారో నిర్ణయించిన తర్వాతే పనులు చేపట్టాలని కొందరు ఆందోళన చేశారు. కానీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారికి భరోసా ఇవ్వడంతో పరిహారం తేలకముందే వారంతా సహకరించారు. దీంతో ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో 9.7 కి.మీ.పొడవున 5.5 మీటర్ల వెడల్పు 15 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించేలా నిర్మాణ పనులు చేపట్టారు. 16 కల్వర్టులు కూడా పూర్తిచేశారు. మధ్యలో గ్యాస్ పైపులైన్ ఉండడంతో అక్కడ 30మీటర్ల పొడవున భూగర్భంలో కెనాల్ నిర్మాణం చేపడుతున్నారు.
కాగా, సీతారామ ఎత్తిపోతల పథకంలోని మూడు పంప్‌హౌ్‌సలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15వ తేదీన ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రారంబోత్సవం కంటే ముందు ప్రాజెక్టులోని మూడు పంప్‌హౌ్‌సల్లోని మోటార్లను ఆదివారం ట్రయల్ రన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ నీటి పారుదల శాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పంప్‌హౌ్‌సల ప్రారంభం రోజున వైరాలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. సీతారామ డీపీఆర్ సీడబ్ల్యూసీ ఆమోదం పొందిందని, మిగిలిన అనుమతులు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టులో ప్యాకేజీ-1, 2కు అవసరమైన భూసేకరణను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు ప్రధాన పనులతో పాటు డిస్ట్రిబ్యూటరీల కోసం కూడా టెండర్లు వేగవంతం చేయాలని ఉత్తమ్ స్పష్టం చేశారు.
Updated Date - Aug 11 , 2024 | 04:18 AM