Share News

Kodandaram: మేడిగడ్డ డిజైన్‌ ఒకటైతే..నిర్మాణం మరోరకంగా..

ABN , Publish Date - Jun 27 , 2024 | 05:33 AM

మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్‌ ఒకటైతే నిర్మాణం మరోరకంగా చేశారని, అందుకే అది కుంగిందని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు.

Kodandaram: మేడిగడ్డ డిజైన్‌ ఒకటైతే..నిర్మాణం మరోరకంగా..

  • తుమ్మిడి హెట్టిని పునఃపరిశీలించాలి: కోదండరాం

హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్‌ ఒకటైతే నిర్మాణం మరోరకంగా చేశారని, అందుకే అది కుంగిందని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని ఆరోపించారు. ఈ విషయాలను డ్యామ్‌ సేఫ్టీ అధికారులే వెల్లడించారని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ సుజల స్రవంతి పేరుతో కాంగ్రెస్‌ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి రూ.800కోట్ల ఖర్చుతో కాల్వల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు.


తుమ్మిడిహెట్టిని పునఃపరిశీలన చేసి కొంతమేరకు పనులు చేసినట్లయితే.. అప్పుడు చేపట్టిన కాల్వల ద్వారా నీటిని తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. మేడిగడ్డ తప్పిదానికి బాధ్యులపై చర్యలు తీసుకుని శిక్షలు వేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి విచారణ కమిషన్‌ వేయాలని అడిగిందే బీఆర్‌ఎస్‌ వాళ్లన్నారు. ఇప్పుడు కమిషన్‌కు అర్హత లేదని చెప్పి.. వాస్తవాలు తెలియకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్‌రోకో కేసులో కేసీఆర్‌తో పాటు తానూ ఉన్నానని గుర్తు చేసిన కోదండరాం.. ఉద్యమకారులందరిపై కేసులు తొలగించాలని కోరాల్సింది పోయి.. ఆయనపైన ఉన్న కేసులే తొలగించాలనడం విడ్డూరమన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 05:33 AM