Komatireddy Venkat Reddy: శ్రీతేజ చికిత్సకు అవసరమైతే అమెరికా వైద్యులనూ రప్పించండి
ABN, Publish Date - Dec 22 , 2024 | 03:17 AM
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు.
వైద్యులకు మంత్రి కోమటిరెడ్డి సూచన.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా
శ్రీతేజ్ తండ్రికి రూ.25లక్షల చెక్ అందజేత
చికిత్సకయ్యే ఖర్చంతా భరిస్తామని హామీ
ఇక పై సందేశాత్మక చిత్రాలకే బెనిఫిట్ షో అనుమతులపై ఆలోచిస్తామని మంత్రి వెల్లడి
బాలుడి ఆరోగ్యం స్థిరంగా ఉంది: వైద్యులు
హైదరాబాద్ సిటీ/రాంగోపాల్‌పేట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. అతడిచెయ్యి పట్టుకొని, పిలిచి, భావోద్వేగానికి గురయ్యారు. బాలుడి తండ్రి భాస్కర్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. భాస్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ‘‘తండ్రిగా ఇద్దరు పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆరోగ్యం జాగ్రత్త భాస్కర్, అధైర్యపడొద్దు.. ఏ అవసరం వచ్చినా నేనున్నాను’’ అంటూ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షల చెక్కును ఆయనకు అందించారు. అలాగే.. శ్రీతేజ్ కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవసరం అనుకుంటే అమెరికా నుంచైనా వైద్యులను రప్పించాలని.. మందులు తెప్పించాలని సూచించారు. శ్రీతేజ్ చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని, ఒక్క రూపాయి కూడా బాలుడి తండ్రి భాస్కర్‌ను అడగొద్దని కిమ్స్ యాజమాన్యానికి స్పష్టం చేశారు. తన కాలేయాన్ని భర్తకు ఇచ్చి ప్రాణదానం చేసి రేవతి.. థియేటర్‌లో తొక్కిసలాటలో తనువు చాలించడం బాధకరమని మంత్రి ఆవేదన వెలిబుచ్చారు. ఏడాది క్రితమే ఆమె తన భర్తకు కాలేయదానం చేశారని.. ఆ చికిత్సకు అయిన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కోలుకునేందుకు సమయం..
శ్రీతేజ్ ఆహారం తీసుకునే పరిస్థితి లేదని వైద్యులు తెలిపారని.. అతడి ఆరోగ్యం కుదుటపడేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారని, కోలుకోవడానికి ఇంకా సంవత్సరమైనా... రెండు సంవత్సరాలైనా పట్టవచ్చన్నారని మంత్రి చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడినా మాటలు వస్తాయో... లేదో తెలియదని వైద్యులు చెప్తున్నారని.. ప్రస్తుతం శ్రీతేజ్ గొంతులో పైప్ వేసి ఆహారం అందిస్తున్నారని, చాలా బలహీనంగా ఉన్నాడని, కదలికలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రేవతి భర్త భాస్కర్‌కు ధైర్యం ఇవ్వడానికి ఆస్పత్రికి వచ్చానని ఆయన చెప్పారు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా భాస్కర్ పిల్లల ఖర్చును ప్రతీక్ ఫౌండేషన్ తరఫున చూసుకునే ప్రయత్నం చేస్తానన్నారు. కాగా.. శ్రీతేజ్‌కు ఆక్పిజన్ సాయం లేకుండా చికిత్స అందిస్తున్నామని, అతడు శ్వాస తీసుకోగలుగుతున్నాడని, శుక్రవారం కంటే శనివారం అతడి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
ఆ సినిమాలకే..
ఇకపై ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని.. దేశ భక్తి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన సినిమాలు, సందేశాత్మక సినిమాలకు మాత్రమే బెనిఫిట్ షో గురించి ఆలోచిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటిరెడ్డి స్పష్టం చేశారు. సినిమా హీరోలు బాధ్యతతో మెలగాలని, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే సినిమా వాళ్లు సినిమా ప్రమోషన్ చేయడానికి బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ‘‘సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం. పరిశ్రమగా గౌరవిస్తాం. అంతేతప్ప దురుసు చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించం’’ అని తేల్చిచెప్పారు.
Updated Date - Dec 22 , 2024 | 03:17 AM