Share News

Apology: మహిళా కమిషన్‌కు కేటీఆర్‌ సారీ!

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:09 AM

హిళల ఉచిత బస్సు ప్రయాణంపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు.

Apology: మహిళా కమిషన్‌కు కేటీఆర్‌ సారీ!

  • ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’పై వ్యాఖ్యలకు క్షమాపణ.. ఆమోదించిన కమిషన్‌

  • పునరావృతం అయితే చర్యలుంటాయని హెచ్చరిక

  • అక్కడే కేటీఆర్‌కు రాఖీ కట్టిన కమిషన్‌ సభ్యులు

  • వారంతా బీఆర్‌ఎస్‌ హయాంలో నియమితులు..

  • వారికి నోటీసులు జారీ చేస్తున్నాం: చైర్‌పర్సన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలను కమిషన్‌ ఆమోదించినట్లు చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ప్రకటించారు. మహిళలను కించపరిచేలా, అసభ్యకరంగా మరోసారి మాట్లాడొద్దని కేటీఆర్‌కు సూచించారు.


పునరావృతమైతే తగిన చర్యలుంటాయని హెచ్చరించారు. కేటీఆర్‌ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ కేటీఆర్‌కు ఇటీవల నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌ శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై వివరణ ఇచ్చిన అనంతరం చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ట్వీట్‌ చేశారు. మహిళలపై చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్‌ విచారం వ్యక్తం చేశారని, క్షమాపణలు చెప్పారని, అలాంటి ప్రకటనలు సరికాదని, తనలాంటి నాయకత్వ స్థాయికి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సరికాదని కేటీఆర్‌ అంగీకరించారని వెల్లడించారు.


భవిష్యత్‌లో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కమిషన్‌ సూచించిందని చెప్పారు. విచారణకు కేటీఆర్‌ వెంట మాజీ మంత్రి సబిత, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, హరిప్రియా నాయక్‌, సత్యవతి రాథోడ్‌ వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మహిళా నాయకురాళ్లకు మధ్య తోపులాట జరిగింది. పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు సహా పలువురు కాంగ్రెస్‌ నాయకురాళ్లను అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. కాగా, కమిషన్‌ ముందు హాజరవ్వడానికి వచ్చిన కేటీఆర్‌కు చైర్మన్‌ చాంబర్‌లోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నియమితులైన కమిషన్‌ సభ్యులు ఆరుగురు రాఖీ కట్టారు.


దీనిపై చైర్‌పర్సన్‌ శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇవ్వాలని, న్యాయ సలహా అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించినప్పటికీ సభ్యుల ప్రవర్తన అనుచితంగా, కమిషన్‌ నియమాలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. కమిషన్‌ నిష్పాక్షికతను, విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. వీరిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాఖీ కట్టడం తప్పు కాదని, కమిషన్‌ కార్యాలయంలో కట్టడం సమంజసం కాదని చెప్పారు.


  • కమిషన్‌పై గౌరవంతోనే హాజరయ్యా

కమిషన్‌పై గౌరవంతోనే స్వయంగా హాజరై నోటీసులకు సమాధానం ఇచ్చానని కేటీఆర్‌ అన్నారు. ఛైర్‌పర్సన్‌ను కలిసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. యధాలాపంగా చేసిన వ్యాఖ్యలపై ఇదివరకే క్షమాపణలు కోరానని చెప్పారు. తనకు మద్దతుగా కమిషన్‌ కార్యాలయానికి వచ్చిన బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలపై కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యేలు సబిత, సునీత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తమపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం డౌన్‌ డౌన్‌ నినాదాలు చేశారు. కాగా, కేటీఆర్‌కు కమిషన్‌ సభ్యులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలపడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకురాలు మాధవి విమర్శించారు. విచారణకు పిలిచిన వారందరికీ రాఖీలతో స్వాగతం పలుకుతారా?అని ప్రశ్నించారు.


  • మాపై దాడులు చేయించారు: సునీతరావు

కేటీఆర్‌ కమిషన్‌ ముందు, ట్విట్టర్‌లో కాకుండా బస్సు ఎక్కి మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్‌ చేశారు. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద.. అడ్డమీది కూలోళ్లను తీసుకొచ్చి తమపై కేటీఆర్‌ దాడులు చేయించారని ఆరోపించారు. దీన్ని సుమోటో కేసుగా తీసుకుని కేటీఆర్‌పై కేసు పెట్టాలని మహిళా కమిషన్‌ను కోరారు. మహిళా కమిషన్‌ కార్యాలయానికి కేటీఆర్‌ విచారణ కోసం వెళ్లారా.. లేక దాడుల కోసమా అని మహిళా కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.శోభారాణి ప్రశ్నించారు. తప్పును ఒప్పుకొని క్షమాపణలు అడగడానికి వచ్చిన కేటీఆర్‌.. మందిమార్బలంతో గొడవ ఎందుకు చేయించారని ప్రశ్నించారు.


  • వాల్మీకి స్కాంలో తెలంగాణ నేతల హస్తం: కేటీఆర్‌

కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న వాల్మీకి స్కామ్‌ వ్యవహారంలో తెలంగాణ నాయకులు, వ్యాపారవేత్తల హస్తం ఉందని కేటీఆర్‌ ఆరోపించారు. అలాంటి వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వాల్మీకి స్కామ్‌లో తలెత్తుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్‌ ఆగ్రనేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఎస్టీ కార్పొరేషన్‌ నుంచి రూ.45కోట్లు హైదరాబాద్‌లోని 9బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఆ ఖాతాలు ఎవరివి? వీ6 పేరుతో ఉన్న బిజినెస్‌ మీద ఆరోపణలు ఉన్నాయి. దాని యజమాని ఎవరు? వాల్మీకి స్కాంకు సంబంధించి హైదరాబాద్‌లో సిట్‌, సీఐడీ, ఈడీ దాడులు నిర్వహించిన తర్వాత కూడా ఈ వార్తలు తెలంగాణలో ఎందుకు రాలేదు?’’అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated Date - Aug 25 , 2024 | 05:51 AM