KTR: పట్టభద్రులారా.. మీరూ మోసపోతారా?
ABN, Publish Date - May 23 , 2024 | 03:48 AM
ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను మోసగిస్తోందని, విద్యావంతులైన పట్టభద్రులు కూడా వీటికి మోసపోతారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. సమాజానికి దిక్సూచిగా ఉంటూ దిశానిర్దేశం చేసేది పట్టభద్రులేనన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఓటేయాలని కోరారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ మోసగిస్తోంది
రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదు
కేసీఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకే వీళ్లు అర్డర్లు ఇచ్చారు
ఎంజీఎంకు కూడా కరెంటు ఇవ్వలేని ప్రభుత్వమిది
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్
వరంగల్, హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను మోసగిస్తోందని, విద్యావంతులైన పట్టభద్రులు కూడా వీటికి మోసపోతారా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. సమాజానికి దిక్సూచిగా ఉంటూ దిశానిర్దేశం చేసేది పట్టభద్రులేనన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ఓటేయాలని కోరారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 50 వేల ఖాళీలతో మెగా డీఎస్సీ వేస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పటి వరకూ అమలు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకొంటున్నారని, కానీ అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలేనని, నాడు లీగల్ సమస్యల వల్ల ఆగిపోయిన వాటికి ఇప్పుడు కేవలం కాగితాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని ఊదరగొడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీగా పోటీ పడుతున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి.. పేద ఇంట్లో పుట్టి బిట్స్ పిలానీలో చదివి గోల్డ్ మెడల్ సాధించారని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెల్లారి లేచింది మొదలు బూతులు తిట్టుడుతోపాటు వెకిలి పనులు చేస్తుంటారని, ఆయన మీద 56 కేసులున్నాయన్నారు. వీరిలో ఎవరికి ఓటేయాలో పట్టభద్రులు ఆలోచించుకోవాలని కోరారు. ‘మండలిలో వైట్ కాలర్ వర్కర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిలర్ ఉండాల్నా ఆలోచించాలి. ఈ ఒక్క సీటుతో మా ప్రభుత్వం రాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు. కానీ, బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే యువత తరఫున మండలిలో ప్రశ్నించే గొంతుక ఉంటుంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ ఫీజు రూ.400 ఉండేదని, ఇప్పుడది రూ.2 వేలు అయిందని, మళ్లీ వాళ్లకే ఓటేస్తే టెట్ ఫీజును రూ.20 వేలు చేస్తారని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద ఆస్పత్రి అయిన ఎంజీఎంకు సైతం సక్రమంగా కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. ఈ సమావేశాల్లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ కన్నీటి దృశ్యాలు!
గడిచిన ఆరు దశాబ్దాల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న కన్నీటి దృశ్యాలు.. ఆరునెలల కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆవిష్కృతం అవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. జోగిపేటలో విత్తనాల కోసం క్యూలైన్‌లో రైతులు తమ పాస్‌బుక్‌లు, కవర్లను పెట్టడం దీనికి ఉదాహరణ అని తెలిపారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, కాలిన మోటర్లు వంటి వాటిని తిరిగి చూస్తున్నామని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
Updated Date - May 23 , 2024 | 03:48 AM