KTR : అమృత్ టెండర్లపై విచారణ జరపండి
ABN, Publish Date - Nov 12 , 2024 | 03:34 AM
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రూ.8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
అర్హత లేకున్నా సీఎం బావమరిదికి కట్టబెట్టారు
శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు
ముఖ్యమంత్రి రేవంత్‌పై చర్యలు తీసుకోండి
కేంద్ర మంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు
ఇప్పుడే ఢిల్లీలో దిగా.. అప్పుడే వణికిపోతే ఎలా?
మంత్రులను ఉద్దేశించి ‘ఎక్స్’లో వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రూ.8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బీఆర్‌ఎస్ బృందంతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ అనే నిబంధనను ఉల్లంఘించి సీఎం రేవంత్‌రెడ్డి తన బావమరిది సుజన్‌రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ.1,137 కోట్ల విలువైన పనులను అప్పగించారని ఫిర్యాదులో కేటీఆర్ తెలిపారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు పనులు అప్పగించడం ద్వారా ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గతంలో ‘ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్’ నిబంధనను ఉల్లంఘించిన సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై వేటు పడిందని గుర్తు చేశారు.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు (1983), ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు (2005), ది జయాబచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2001), దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా (2003) కేసులను ఉదాహరణలుగా కేటీఆర్ ప్రస్తావించారు. 2014లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కేటాయించిందని, కర్ణాటక ముడా స్కాంలో సీఎం తన భార్యకు భూములు కేటాయించారని, అలాగే రేవంత్‌రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని ఆరోపించారు.
అమృత్ టెండర్ల అవినీతిపై పారదర్శకంగా విచారణ జరిపించాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి, సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటూ మంత్రులు చేసిన ఆరోపణలపై ‘ఎక్స్’లో స్పందిస్తూ, ‘‘జస్ట్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నా. అప్పుడే వణికిపోతే ఎలా?’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మైనారిటీ డిక్లరేషన్ ఏమైంది..?
హామీలివ్వడం తప్ప మైనారిటీలకు కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పేద ముస్లిం విద్యార్థులకు నోట్ బుక్కులు, పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఇమామ్‌లు, మౌలానాలకు రూ.12 వేలు ఇస్తామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. మైనారిటీ సబ్ ప్లాన్ పేరిట ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తామన్న హమీ ఏమైందని నిలదీశారు. ఉపాధి కోసం రూ.వెయ్యి కోట్ల రుణాలిస్తామని.. రూ.లక్ష కూడా ఇవ్వలేదన్నారు. వికారాబాద్‌లో కలెక్టర్‌పై రైతులు తిరగబడటం రేవంత్ పాలనా వైఫల్యమేనని కేటీఆర్ అన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 04:07 AM