Share News

Hyderabad: బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం: కేటీఆర్‌

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:25 AM

మరో పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు.

Hyderabad: బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): మరో పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎక్స్‌ వేదికగా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని, లేదంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో చేనేత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.


ఎన్డీయే హయాంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేశారని, హ్యాండ్లూమ్‌ బోర్డును రద్దు చేశారని, త్రిఫ్ట్‌ పథకం రద్దు చేశారని విమర్శించారు. నూలుపోగులపై రాయితీని 40 నుంచి 15 శాతానికి తగ్గించడం బాధాకరమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ పాలనలో చేనేత రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు నేతన్నల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేశారని తెలిపారు. రేవంత్‌ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి, చేనేత రంగాన్ని గట్టెక్కించాలని డిమాండ్‌ చేశారు. నేతన్నలకు ఆయన ఎక్స్‌ వేదికగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Aug 08 , 2024 | 04:25 AM