KTR: 3 విడతల్లో 40% మందికే మాఫీ!
ABN, Publish Date - Aug 19 , 2024 | 04:10 AM
రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేతలను డిమాండ్ చేశారు.
షరతుల్లేకుండా రుణమాఫీ చేయండి
ఖర్గే, రాహుల్‌కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేసి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేతలను డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీకి ఆదివారం లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల దగాపడిన లక్షలాది మంది తెలంగాణ రైతుల తరఫున లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబరు 9న ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి 8 నెలలు ఊరించి.. మూడు విడతలుగా మాఫీ చేస్తూ రైతులను వంచించారని ఆరోపించారు.
మూడు విడతల్లోనూ కేవలం 40 శాతం మందికి మాఫీ చేసి, మిగతా రైతులను ఉసూరుమనిపించారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో 36 లక్షల మందికి రూ.లక్షలోపు రుణమాఫీకి రూ.17వేల ఖర్చయిందన్న కేటీఆర్.. రూ.2 లక్షల రుణమాఫీ అని ఘనంగా ప్రకటించి కేవలం 22 లక్షల మందికి రూ.17,900 కోట్లు మాఫీ చేసి, సంపూర్ణమని సీఎం ప్రకటించడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
రాష్ట్ర ్టస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్క ప్రకారం రూ.2లక్షల రుణమాఫీకి రూ.49,500కోట్లు అంచనా వేయగా.. దాన్ని రూ.31వేల కోట్లకు కుదించారని, చివరికి రూ.17,933 కోట్లతో మమ అనిపించారని ఆరోపించారు. పలు జిల్లాల్లో రుణమాఫీ కాని అన్నదాతలు రోడ్డెక్కారని, మంచిర్యాలలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి చిత్తశుద్ధి ఉంటే.. ఇక్కడి సర్కారు వైఖరిని మార్చి, ఎలాంటి షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు 1వ తేదీన జీతాలివ్వడం అబద్ధం
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పెద్ద అబద్ధమని, వారి వైఫల్యానికి వసీం ఆత్మహత్యే ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా దవాఖానాలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వసీం... కుటుంబం గడవక ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ మరణానికి కారణమెవరని కేటీఆర్ ఆదివారం ఎక్స్‌లో ప్రశ్నించారు.
Updated Date - Aug 19 , 2024 | 04:10 AM