Tihar Jail: కవిత 11 కిలోల బరువు తగ్గింది!
ABN, Publish Date - Aug 10 , 2024 | 03:56 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 11 కిలోల బరువు తగ్గిందని ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందన్నారు.
బీపీ పెరగడంతో మాత్రలు వేసుకుంటోంది
త్వరలోనే బెయిలు వస్తుందని భావిస్తున్నాం
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 11 కిలోల బరువు తగ్గిందని ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీపీ పెరగడంతో మాత్రలు వేసుకోవాల్సి వస్తోందన్నారు. తన సోదరి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. జైలు శుభ్రంగా లేదని, కవిత చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 11 వేల మంది ఖైదీలు ఉండాల్సిన తిహాడ్ జైల్లో 30 వేల మంది ఉన్నారన్నారు.
ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, కవితకు కూడా వస్తుందనే ఆశావహ దృక్పథంతో ఉన్నామని కేటీఆర్ చెప్పారు. కవితకు కూడా బెయిల్ పిటిషన్ వేశామన్నారు. సోమవారం పిటిషన్ విచారణకు వస్తుందని తెలిపారు. కవితకు త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలున్నాయన్నారు. న్యాయం అందడంలో ఆలస్యమైతే న్యాయం జరగనట్లేనని అన్నారు.
కవిత కస్టడీ పొడిగింపు
సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా మరోసారి పొడిగించారు. కస్టడీ పూర్తి కావడంతో శుక్రవారం కోర్టు ముందు కవితను వర్చువల్‌గా హాజరుపర్చారు. సీబీఐ చార్జిషీటులో పేపర్లకు ఒకవైపు మాత్రమే పేజీ నంబర్లు వేశారని, దానివల్ల వాదనలు వినిపించడం కష్టంగా ఉందని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని సరి చేసి 14లోపు సమర్పిస్తామని సీబీఐ తెలపగా.. విచారణను న్యాయమూర్తి 21కి వాయిదా వేశారు.
Updated Date - Aug 10 , 2024 | 03:56 AM