సావిత్రి బాయి ఫూలేకు ఘన నివాళి
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:00 PM
సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం నారాయణపేట సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.

నారాయణపేట, జనవరి 3 : సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం నారాయణపేట సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో బాలికల కోసం మొదటి బాలికల పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి సావిత్రి బాయి అని అన్నారు. చదువులో మహిళలకు నిషేధం ఉన్న రోజుల్లోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గాంచారన్నారు. అణగారిన వర్గాల కోసం ఆమె అలుపెరగని పోరాటం చేశారన్నారు. సీపీఎం నాయకులు గోపాల్, బాల్‌రామ్, మల్లేష్, భాస్కర్, పవన్, కనకప్ప పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్ : మండలంలోని లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేని నివాళి అర్పించారు. అనంతరం పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయురాలు సంధ్యను విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాలువా, పూలమాలతో సన్మానించారు. మహిళా సాధికారత, అణగారిన ఆడపిల్లలకు అక్షరాలు నేర్పించిన సామాజిక విప్లవ కారిణి, భారత దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. హెచ్‌ఎం వై.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
మాగనూరు : మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాగనూరు ఉన్నత పాఠశాలలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. హెచ్‌ఎం నరసింహులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు.
ధన్వాడ : మండల కేంద్రమైన ధన్వాడలో బుధవారం బీఎస్పీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదే విధంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొదిగేలి శ్రీనివాసులు, ఎలిగేండ్ల వెంకటేష్, జడల బాల్‌రాజు పాల్గొన్నారు. అదే విధంగా గోటూర్ బాలికల ఉన్నత పాఠశాలలో పావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.