Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ABN, Publish Date - Dec 12 , 2024 | 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్‌లో డబ్బులు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని, కానీ ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్‌లు అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మె
సిద్దిపేట: ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో హాస్టళ్లు, గురుకులాలు అధ్వానంగా మారిపోయాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదంటూ హరీశ్ రావుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తెలియజేశారు. జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్‌లో డబ్బులు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని, కానీ ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్‌లు అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మెస్ ఛార్జీలు చెల్లించనందుకు, పిల్లలకు అన్యాయం చేస్తునందుకు సీఎం రేవంత్ రెడ్డికి కచ్చితంగా శిక్ష వేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట, రాజీవ్ గాంధీ యాడ్ పేరిట ముఖ్యమంత్రి కోట్లు ఖర్చు చేస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు మాత్రం భోజనం పెట్టకుండా అర్దాకలితో అలమటించేలా చేస్తున్నారని మండిపడ్డారు. చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ట్యూషన్, కాస్మొటిక్ ఛార్జీలు సైతం ఆరు నెలల నుంచి రావడం లేదని అన్నారు. శానిటేషన్, స్వీపింగ్ ఛార్జీలూ చెల్లించలేదని, సీఎం రేవంత్‍కి మాటలు ఎక్కువ చేతలు తక్కువవి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు. హాస్టళ్లలో అంతా మంచిగానే ఉంటే అరెస్టులు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చేయాల్సింది.. అరెస్టులు కాదు, పిల్లల సమస్యలు పరిష్కరించడమని ఆయన పేర్కొన్నారు. విద్యా శాఖ, సాంఘిక సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకుని అధ్వానంగా మార్చారని మండిపడ్డారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి తన బొమ్మ ప్రచారం చేసుకోవడం కోసం 9 రోజులపాటు ఉత్సవాలు జరిపారని, కానీ హాస్టల్ మెస్ బిల్లులు మాత్రం చెల్లించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పాలన అంటే ప్రతిపక్షాలను అరెస్టు చేయడం కాదని, ప్రజల మధ్య ఉండడం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Updated Date - Dec 12 , 2024 | 09:17 PM