Siddipet: తెలంగాణ ఉద్యమంలో ఆ పాట వింటే రోమాలు నిక్కపోడిచేవి: మాజీ మంత్రి హరీశ్ రావు..
ABN, Publish Date - Dec 15 , 2024 | 06:00 PM
తెలంగాణ ఉద్యమంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యమంలో ఆయన పాటలు ఎంతో ప్రత్యేకమని మాజీ మంత్రి చెప్పారు.
సిద్దిపేట: తెలంగాణ (Telangana) ఉద్యమంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ (Gaddar) పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఉద్యమంలో ఆయన పాటలు ఎంతో ప్రత్యేకమని మాజీ మంత్రి చెప్పారు. సిద్దిపేట విపంచి కళా నిలయంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ సాహిత్య రచనల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ జ్ఞాపకాలు, సాహిత్యాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. " తెలంగాణ ఉద్యమ చరిత్రను పుస్తకం రూపంలో తీసుకురాలేకపోయాం. గద్దర్ అర్ద శతాబ్దపు పోరాట స్ఫూర్తిని ఆయన కుమారుడు సూర్యం పుస్తకం రూపంలో తెచ్చారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి పుస్తకం తెచ్చారు. గద్దరన్న బతుకమ్మ పాటలను అందించారు. ఆయన అన్ని పోరాటాల్లో పాల్గొన్నారు. అన్న పాట వంద ఉపన్యాసాలకు సమానం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ఎంతో ప్రత్యేకం. మలిదశ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద పాటతో రోమాలు నిక్క పొడిచేవి. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన అభ్యర్థుల మీద పోటీ పెట్టవద్దని గద్దర్ కోరారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అండగా నిలబడ్డారు. జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలు పెరగడానికి గద్దర్ అన్న ప్రతిపాదన చేశారు.
సిద్దిపేటలో గద్దరన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సభ పెడుతాం. ఆయన జీవిత విశేషాలతో డాక్యుమెంట్ రూపొందిస్తే నేను సహాయం చేస్తా. స్వాతంత్ర్యం వచ్చిన ఏళ్లు గడుస్తున్నా అసమానతలు పోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదు. అమరవీరులకు నివాళులు అర్పించలేదు. తెలంగాణ తల్లి రూపాన్ని రేవంత్ రెడ్డి మార్చారు. ప్రజల ఆలోచనలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనంత వరకూ, అణచివేత ఉన్నంత వరకూ ప్రభుత్వ అవార్డులకు అర్థం లేదనే మాట గద్దరన్న చెప్పారు. నేడు అదే స్ఫూర్తితో నందిని సిధారెడ్డి కోటి రూపాయల అవార్డును తిరస్కరించారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తొలగించడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో ఉన్న అసమానతలు చెరిపేసే విధంగా ముందుకు వెళ్లాలి. విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమం ప్రతి దాంట్లో గద్దరన్న న్యాయం వైపున నిలిచి పోరాడారని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: తెలంగాణ అన్నీ రంగాల్లో తిరోగమిస్తోంది: కేటీఆర్..
Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా: భట్టి విక్రమార్క
Updated Date - Dec 15 , 2024 | 06:05 PM