Kidnap Case: సంగారెడ్డి కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లిదండ్రుల వద్దకు చేరిన చిన్నారి..
ABN, Publish Date - Oct 11 , 2024 | 08:40 PM
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అక్టోబరు 9న అపహరణకు గురైన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది.
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అక్టోబరు 9న అపహరణకు గురైన చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే గర్భిణీ డెలివరీ నిమిత్తం మంగళవారం రాత్రి జిల్లా ఆస్పతిలో చేరింది. ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే కాన్పు సమయంలో గది బయట అనుమానాస్పదంగా తిరిగిన ముగ్గురు మహిళలు.. అనంతరం చిన్నారిని ఎత్తికెళ్లిపోయారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన 30గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు.
కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. స్థానికులు, చిన్నారి తల్లిదండ్రుల సమాచారం మేరకు వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురు మహిళలు అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 12బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితురాళ్లు హైదరాబాద్ బొరబండ ప్రాంతానికి చెందిన మహిళలుగా దర్యాప్తులో తేలింది. రుక్సాన, జవేరియా, ఫాతిమా అనే మహిళలు చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు సంగారెడ్డి పోలీసులు గుర్తించారు. వెంటనే హైదరాబాద్‍కు చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం చిన్నారిని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. రుక్సానాకు ఆడపిల్లలు లేకపోవడంతో ఓ ఆడపిల్లను పెంచుకోవాలనే కోరిక ఉండేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు తన స్నేహితురాళ్లతో పక్కా పథకం వేసి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు విచారణలో వైల్లడైందని చెప్పారు. ముగ్గురు మహిళలూ నేరం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే కుమార్తె తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ చిన్నారిని సురక్షితంగా తీసుకురావడంపై పోలీసులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Cyberabad Police: పర్మిషన్ల కోసం పోలీస్ బాస్‌ల కొత్త వెబ్‌సైబ్.. వివరాలు ఇవే..
Minister Thummala: ప్రపంచంతో పోటీ పడేందుకే ఆ పాఠశాలలు: మంత్రి తుమ్మల..
Harish Rao: తెలంగాణ అంటే ఎందుకంత చిన్న చూపు.. కేంద్రానికి హరీశ్ రావు సూటి ప్రశ్న..
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి ముందు దానికి సమాధానం చెప్పాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Updated Date - Oct 11 , 2024 | 08:40 PM