Komati Reddy Venkat Reddy: దొంగచాటుగా అమెరికాకు హరీశ్‌రావు..
ABN, Publish Date - Jun 03 , 2024 | 04:31 AM
మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు గత నెల 27న ఎమిరేట్స్ విమానంలో దొంగచాటుగా అమెరికా వెళ్లిన హరీశ్‌రావు.. అక్కడే ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయనకు చెప్పి వచ్చారని పేర్కొన్నారు.
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిశారు
ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పి వచ్చారు
ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా?
ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకే
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు గత నెల 27న ఎమిరేట్స్ విమానంలో దొంగచాటుగా అమెరికా వెళ్లిన హరీశ్‌రావు.. అక్కడే ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయనకు చెప్పి వచ్చారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు అప్రూవర్‌గా మారితే తాను, తన కొడుకు కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కేసీఆరే హరీశ్‌రావును అమెరికా పంపారని తెలిపారు. 27వ తేదీ తెల్లవారు జామున 4.30గంటలకు ఎమిరేట్స్ విమానం(ఈకే 525)లో కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన హరీశ్‌రావు.. శనివారం ఉదయం తిరిగి వచ్చారని పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధి విదేశాలకు వెళ్లే ముందు మీడియాకు వెల్లడించడం ఆనవాయితీ అని, కానీ.. హరీశ్ అమెరికా వెళ్లి వచ్చిన సంగతి ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు. ప్రభాకర్‌రావును హరీశ్ కలిసినప్పుడు అక్కడ బయట ఉన్న వాళ్లే తనకు ఈ విషయం చెప్పారన్నారు.
హరీశ్‌కు దమ్ముంటే అమెరికా వెళ్లి ప్రభాకర్‌రావును కలవలేదంటూ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారులతో ఫోన్ ట్యాపింగ్‌లు చేయించి... తెలంగాణను కేసీఆర్ నవ్వుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, మీడియా యాజమాన్యాలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి, రూ.వేల కోట్లు వసూళ్లు చేశారని ఆరోపించారు. ప్రభాకర్‌రావును పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని నెల క్రితం కేంద్రానికి లేఖ రాసినా, స్పందన రాలేదని వెల్లడించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మిలాఖత్ అయినందునే స్పందించడం లేదని ఆరోపించారు. ఇవాళ కాకుంటే రేపైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకుని రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తామని, ప్రభాకర్‌రావును రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కేసీఆర్, హరీశ్‌రావులు ఎక్కడ ఉంటరో తనకు తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఈ దొంగచాటు వ్యవహారం పక్కన పెట్టి.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేసీఆర్‌కు సూచించారు.
4వ తేదీ తర్వాత బీఆర్‌ఎస్ క్లోజ్
ఈ నెల 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ దుకాణం మూతపడబోతుందని, 16 స్థానాల్లో బీఆర్‌ఎ్‌సకు డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఒకటి, రెండు తప్ప అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నేతలు.. బీజేపీకి ఓట్లు వేయించారని ఆరోపించారు. అందుకే తెలంగాణలో 9 నుంచి 11 సీట్లు వస్తాయంటూ బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారన్నారు. కానీ, అదంతా జరిగే పని కాదని, కాంగ్రె్‌సకు కనీసం 12 సీట్లు వస్తాయని చెప్పారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల బలం ఉండడం వల్లే బీఆర్‌ఎస్ గెలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగా ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనే చిల్లర పార్టీ కాంగ్రెస్ కాదని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల దగ్గర దోచుకున్న డబ్బులు ఉన్నందునే... క్యాంపులు పెట్టి గెలిచారన్నారు. పాకిస్థాన్ నేత జిన్నా మాదిరిగా కేసీఆర్ వైఖరి ఉందని, రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఒక రోజు ముందే నిర్వహించారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చేపలు, గొర్రెల పథకాల్లో రూ. వేల కోట్ల అవినీతి జరిగిందని తాము చెప్పామని, అది నిజమేనని ఇప్పుడు తేలిందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పీడ పోయిందని ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
Updated Date - Jun 03 , 2024 | 04:31 AM