Narayana Khed : విహారయాత్ర విషాదాంతం
ABN , Publish Date - Jul 03 , 2024 | 04:19 AM
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన కొందరు యువకులు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మిగిలింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
మహారాష్ట్రలోని పుణె సమీపంలో రోడ్డు ప్రమాదం
అదుపు తప్పి కల్వర్టుని ఢీకొట్టిన కారు
నారాయణఖేడ్‌కు చెందిన ఐదుగురు యువకుల మృతి
నారాయణఖేడ్, జూలై 2: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన కొందరు యువకులు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మిగిలింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాద వివరాలిలా ఉన్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన మహబూబ్ ఖురేషి, రఫీక్ ఖురేషి, ఫిరోజ్, ఇస్మాయిల్, ఫిరోజ్, అమెర్ కలిసి అజ్మేరా దర్గా సందర్శన కోసం ఆదివారం సాయంత్రం కారులో వెళ్లారు. ముంబై, అజ్మేరా దర్గా సందర్శన అనంతరం మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే, వీరు ప్రయాణిస్తున్న కారు పుణె సమీపంలో అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దీంతో నారాయణఖేడ్‌కు చెందిన మహబూబ్ ఖురేషి, రఫీక్ ఖురేషి, కంగ్టికి చెందిన ఫిరోజ్, హైదరాబాద్ బొరబండలో ఉండే ఫిరోజ్, ఇస్మాయిల్ అక్కడికక్కడే మృతి చెందారు. నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్‌కు చెందిన అమెర్ తీవ్ర గాయాలతో పుణెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరుగురు యువకులు 30 ఏళ్ల లోపు వయస్సు వారే. కంగ్టికి చెందిన ఫిరోజ్, హైదరాబాద్‌లో ఉండే ఫిరోజ్ వివాహితులు. కాగా, సౌదీలో పని చేసే మహబూబ్ ఖురేషి నెల రోజుల క్రితం స్వస్థలం నారాయణఖేడ్‌కు వచ్చాడు. మిగిలిన వారంతా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.