Share News

TPCC: సంక్రాంతికి కొత్త కార్యవర్గం!

ABN , Publish Date - Dec 26 , 2024 | 04:59 AM

సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది.

TPCC: సంక్రాంతికి కొత్త కార్యవర్గం!

  • పండగ తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటన

  • ప్రచార కమిటీ చైర్మన్‌గా జగ్గారెడ్డి!

  • కార్యనిర్వాహక అధ్యక్షులుగా ముగ్గురు

  • సీడబ్ల్యూసీ తర్వాత ఇన్‌చార్జి కార్యదర్శినీ మార్చే అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తర్వాత టీపీసీసీ కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. జనవరి మొదటి వారంలో ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ సహా కార్యవర్గాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుంది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జినీ మార్చి.. కొత్త వారిని నియమించనుంది. మొత్తమ్మీద సంక్రాంతి తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ.. టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ సారధ్యంలో నిర్మాణ పరంగా కొత్త దనం సంతరించుకోనుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ నియామకం జరిగి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటుపై ఇటీవల ఏఐసీసీ కొంత కసరత్తు చేసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ నియామకం జరిగినప్పుడు ఏకంగా ఐదుగురికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న తూర్పు జగ్గారెడ్డికి.. ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వద్ద జగ్గారెడ్డికి.. మంచి ఆర్గనైజర్‌ అన్న పేరుంది. జగ్గారెడ్డి ఆర్గనైజింగ్‌ స్కిల్‌ను పార్టీకి ఉపయోగించుకోవాలంటూ రాహుల్‌గాంధీ చేసిన సూచన మేరకే ప్రచార కమిటీ చైర్మన్‌ పోస్టును ఆయనకు ఖరారు చేసినట్లు చెబుతున్నారు.


ఈసారి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ముగ్గురికే అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడా సామాజిక వర్గాల నుంచి తీసుకోవాలన్న నిర్ణయానికి ఏఐసీసీ వచ్చినట్లుగా చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఏఐసీసీలోనే వంశీచంద్‌రెడ్డి సేవలను వినియోగించుకోవాలని అధిష్ఠానం భావిస్తే రేసులో రోహిన్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మిగులుతారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాం నాయక్‌లను నియమించేందుకే ఎక్కువగా అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడే బీసీ కావడంతో.. ఆ వర్గం నుంచి కార్యనిర్వాహక అధ్యక్షుడిని తీసుకునే అవకాశం లేదంటున్నారు. ముస్లింల నుంచి కార్యనిర్వాహక అధ్యక్షుడిని తీసుకోవాలా.. వద్దా? అన్న తర్జనభర్జన కూడా పార్టీలో నడిచింది. ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌నే మళ్లీ నియమించాలా? లేక నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్‌ఖాన్‌ను తీసుకోవాలా అన్నదానిపై చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో ముస్లింల నుంచీ ఒకరిని కార్యనిర్వాహకఅధ్యక్షుడిగా తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తే ఫిరోజ్‌ఖాన్‌కే ఎక్కువ అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


దీపాదాస్‌ స్థానంలో భూపేశ్‌ భగేల్‌!

బెల్గాంలో గురు, శుక్రవారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జి కార్యదర్శులనూ మార్చనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ స్థానంలో కొత్త ఇన్‌చార్జి రానున్నారు. సహజంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో సీఎంను డీల్‌ చేసేందుకు ఆ స్థాయి వ్యక్తులను ఇన్‌చార్జిలుగా నియమిస్తారు. ఈ సారి తెలంగాణకు ఛత్తీ్‌సఘడ్‌ మాజీ సీఎం భూపేశ్‌ భగేల్‌, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో భూపేశ్‌ భగేల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రానికి మరో ఏఐసీసీ కార్యదర్శి పోస్టూ దక్కే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ్‌కుమార్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 26 , 2024 | 04:59 AM