రెండు కాదు.. మూడు పులులు!
ABN , Publish Date - Jan 11 , 2024 | 04:22 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపులుల మృత్యువాత ఘటన తర్వాత అటవీశాఖ మిగిలిన వాటి కోసం అన్వేషణ ప్రారంభించింది.

విషపు ఆవును తిన్న మరో పులి
ట్రాప్ కెమెరాలో వీడియో రికార్డు
ఇప్పటికే రెండు పులుల మృతి
ఇతర పులుల కోసమూ అడవుల జల్లెడ
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెద్దపులుల మృత్యువాత ఘటన తర్వాత అటవీశాఖ మిగిలిన వాటి కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో చురుగ్గా సంచరించే ఎస్-6, దాని పిల్లల ఆచూకీ వారం రోజులుగా కన్పించకుండా పోవటంతో అవి సురక్షితంగా ఉన్నాయా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారుల్లో ఆందోళన కన్పిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో అటవీ సిబ్బంది కాగజ్‌నగర్ దరిగాం నుంచి అటు వాంకిడి, ఇటు సిర్పూరు వరకు గతంలో పులుల కదలికలున్న ప్రాంతాలన్నింటినీ జల్లెడ పడుతున్నారు. సోమవారం కనుగొన్న ఎస్9 మగ పులితోపాటు మొత్తం మూడు పులులు విషపూరితమైన ఆవు మాంసాన్ని భుజించాయి. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డు అయ్యాయని అటవీశాఖకు చెందిన విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. వీటిలో ఇప్పటికే రెండు పులులు మృతిచెందడంతో మరో పులి ఏమై ఉంటుందన్న కోణంలో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ పులి కూడా ఇదే మాంసాన్ని భుజించటం వల్ల చనిపోయిందా..? లేదా సురక్షితంగా ఉందా అనే విషయాన్ని తేల్చేందుకు ఎనిమల్ ట్రాకర్స్‌తోపాటు ఫారెస్టు రేంజర్లు, బీట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, మిగితా పులుల కోసం తాగునీటి వనరులు, గతంలో సంచరించిన ప్రదేశాల్లో గాలిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మిగతా పులులకు సంబంధించిన పాదముద్రలు(పగ్‌మార్క్) లభ్యం కాకపోవటంతో సిబ్బందికి వాటి జాడ గుర్తించడం కష్టతరంగా మారినట్లు తెలుస్తోంది.
విషం పెట్టి.. వీడియో తీసి..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులులు మృత్యువాత కేసు మిస్టరీని పోలీసులు చేధించినట్టు సమాచారం. వాంకిడి మండలం సర్కపల్లికి చెందిన నలుగురు చనిపోయిన ఆవుపై విషం చల్లి వీడియో తీసినట్టు తెలిసింది. ఆవుపై విషం చల్లిన తర్వాత వీరంతా పులి రాక కోసం కాసేపు వేచి చూశారు. కొద్దిసేపటి తర్వాత పులి తన పిల్లలతో వచ్చి చనిపోయిన ఆవును తిన్నది. ఈ దృశ్యాలను కూడా వారు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు. వరుసగా రెండు పులులు చనిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగటంతో సర్కపల్లి అటవీ ప్రాంతానికి సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించి నలుగురు అనుమానుతులను తమదైన శైలిలో విచారణ జరుపగా, విషం పోసిన డబ్బాను అధికారులకు చూపించినట్టు తెలిసింది.