Fee Payment: పది ఫీజు పరేషాన్..
ABN , Publish Date - Nov 16 , 2024 | 03:58 AM
పదో తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్‌లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి రెండు రోజుల సమయమే ఉంది.
6-10 విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి
ఏ ఒక్కరిది కాకున్నా పరీక్ష ఫీజు చెల్లింపులో ఇబ్బంది
ఈ ఏడాది తెచ్చిన కొత్త నిబంధనతో తంటాలు
ఎల్లుండి వరకే గడువు.. పొడిగింపునకు డిమాండ్
హైదరాబాద్, నవంబరు15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షలను రాయబోయే విద్యార్థులకు ఆన్‌లైన్ కష్టాలు మొదలయ్యాయి. మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు సంబంధించి ఈ నెల 18వ తేదీలోపు విద్యార్థులు ఫీజును చెల్లించాల్సి ఉంది. గడువు ముగియడానికి రెండు రోజుల సమయమే ఉంది. ఇందులోనూ వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈ ఫీజును చెల్లించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా యుడైస్ పోర్టల్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన యుడైస్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ప్రకారమే విద్యార్థులకు ఉచిత భోజనం, పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాంలు అందించడం అమలు చేస్తున్నారు. ఈ యూడైస్ పోర్టల్‌లోని డేటాను బోర్డ్ ఆఫ్ సెకండరి ఎడ్యుకేషన్‌కు బదిలీ చేస్తే టెన్త్ పరీక్షల ఫీజును చెల్లించడానికి వీలవుతుంది. ఈ డేటా ప్రకారమే నామినల్ రోల్‌ను రూపొందిస్తారు. దీని ప్రకారమే విద్యార్థికి సంబంఽధించిన వివరాలతో టెన్త్ మెమోను ముద్రిస్తారు.
కొత్త నిబంధనతో ప్రక్రియ ఆలస్యం
ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన ఒక నిబంధన కారణంగా అనేక స్కూళ్లల్లో విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ పూర్తి కాలేదు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రతీ విద్యార్థి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు సర్క్యూలర్‌ను జారీ చేశారు. ఇందులో ఒక్క విద్యార్థికి సంబంధించిన వివరాల నమోదు కాకపోయినా టెన్త్ ఫీజును చెల్లించడంలో ఇబ్బంది తలెత్తుతున్నది. గత ఏడాది వరకు కేవలం టెన్త్ క్లాసు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఫీజును చెల్లించడానికి అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది కచ్చితంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల వివరాలను నమోదు చేయాలనే నిబంధనతో కొంత ఇబ్బంది తలెత్తిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. విద్యార్థులు స్కూళ్లు మారడం, కొత్తగా అడ్మిషన్లను తీసుకోవడం, స్కూల్ వదిలి వెళ్లిపోవడం వంటి కారణాలతో కొంత మంది విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు.
పరీక్ష ఫీజు గడువును పొడిగించాల్సిందే
విద్యార్థుల వివరాలను ఇంకా పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడంతో టెన్త్ క్లాసు పరీక్ష ఫీజుల చెల్లింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సాంకేతిక ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని టెన్త్ పరీక్ష ఫీజు గడువును పొడిగించాల్సిందిగా తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్ర ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు.