Asifabad: బురద రోడ్డులో ఎడ్లబండిపై ప్రయాణం.. తల్లి గర్భంలోనే శిశువు మృతి
ABN , Publish Date - Aug 20 , 2024 | 05:42 AM
తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది.
అంబులెన్స్‌కి దారిలేక దారుణం.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
పెంచికలపేట, ఆగస్టు 19 : తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం మేరగూడకు చెందిన దుర్గం పంచపూల గర్భిణి.
సోమవారం తెల్లవారు జామున తీవ్రమైన నొప్పులతో ఆమెకు రక్తస్రావం అయింది. మేరగూడ రోడ్డు గుంతలతో బురదమయంగా ఉండడంతో 108 అంబులెన్స్ చేరుకునే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక గర్భిణి ఎడ్ల బండిలో అవస్థలు పడుతూ 2.5కి.మీ. ప్రయాణించింది. అప్పటికే ఎల్లూరుకు చేరుకున్న ఆమెను కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. కానీ గర్భిణి పరిస్థితి విషమించడంతో కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు నిర్ధారించారు.