Nagarkurnool: గద్దర్ ఆట, పాటల వల్లే తెలంగాణ కల సాకారం
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:36 AM
ఆటా, పాట, నటన, ప్రశ్నించేతత్వంతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ప్రజాయుద్ధ నౌక గద్దర్ అయితే, ఇచ్చింది సోనియాగాంధీ అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.
తెలంగాణ తెచ్చిందే గద్దర్.. ఇచ్చింది సోనియా
ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టడం అన్యాయం
గద్దర్ విగ్రహావిష్కరణ సభలో ప్రొఫెసర్ కంచె ఐలయ్య
మన్ననూర్, అక్టోబరు5: ఆటా, పాట, నటన, ప్రశ్నించేతత్వంతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ప్రజాయుద్ధ నౌక గద్దర్ అయితే, ఇచ్చింది సోనియాగాంధీ అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో గద్దర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణ ఏర్పడలేదని, గద్దర్ ఆట, పాటల వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణ తెచ్చిన గద్దర్‌ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ముందు ఆరు గంటలు నిలబెట్టి అన్యాయం చేశారని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
గద్దర్ అందం, పాటలు, నాట్యం, నటన ముందర ఎవ్వరూ సాటిరారన్నారు. అక్రమ సంపాదన, దోపిడీల పేరుతో ప్రజలను మోసం చేస్తే గద్దర్ దయ్యమై శిక్షించడం ఖాయమని ఐలయ్య ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ గద్దర్ మరణించినా ఆయన నేర్పిన పోరాట స్ఫూర్తి ఎప్పటికీ బతికే ఉంటుందన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ గద్దర్‌కు నల్లమల అంటే ఎంతో ఇష్టమని, అందుకే నల్లమల ప్రాంతంలోని మన్ననూరు నుంచే విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.