TG: రోహిణి ఎండలు మొదలు..!
ABN, Publish Date - May 26 , 2024 | 03:52 AM
రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమవనున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందటి వరకు 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదైన ఉష్ణోగ్రత.. మళ్లీ 45 డిగ్రీలు దాటుతోంది.
45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు.. ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో గాలివాన బీభత్సం
వేగంగా విస్తరిస్తున్న ‘నైరుతి’
నేడు అక్కడక్కడ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమవనున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందటి వరకు 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదైన ఉష్ణోగ్రత.. మళ్లీ 45 డిగ్రీలు దాటుతోంది. నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జిల్లా ముజిగిలో 45.2, జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.9, ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మియాపూర్‌లో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి), పెంచికలపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో ఇంటిపై రేకులు గాలికి ఎగిరి మీద పడడంతో మల్లవ్వ అనే వృద్ధురాలు మృతి చెందింది. మల్లాపూర్ మండల కేంద్రంలో జగిత్యాల పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ ఖదీర్ (60) గుండెపోటుతో మృతి చెందాడు. ఎరువుల సంచుల లోడ్‌ను తీసుకురాగా.. ఒక్కసారిగా వర్షం పడటంతో తీవ్ర భయాందోళనకు గురైన అతడు.. ఎరువుల సంచులపై టార్పాలిన్ కప్పుతూనే కుప్పకూలాడు.
విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో వేగంగా విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోనికొన్ని ప్రాంతాలకు వ్యాపించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. బంగ్లాదేశ్ వైపుగా కదులుతున్నట్లు తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఉండదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
రాజస్థాన్ ఫలోడిలో 50 డిగ్రీలు!
రాజస్థాన్‌లోని ఫలోడి గ్రామంలో శనివారం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు.
Updated Date - May 26 , 2024 | 03:52 AM